Mahaa Daily Exclusive

  భాగ్యనగరంలో జశోదాబెన్ ఆధ్యాత్మిక పర్యటన: భాగ్యలక్ష్మి, ఉజ్జయిని మహంకాళి అమ్మవార్ల సందర్శన!

Share

* హైదరాబాద్‌లో జశోదాబెన్ ఆధ్యాత్మిక పర్యటన.
* నిరాడంబరంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల సందర్శన.
* సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో పూజలు.

హైదరాబాద్, మహా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్ గురువారం హైదరాబాద్‌లో పర్యటించి పలు ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా అత్యంత నిరాడంబరంగా ఆమె ఈ పర్యటన సాగించారు. గురువారం ఉదయం నగరానికి చేరుకున్న ఆమె, నేరుగా పాతబస్తీలోని చారిత్రక చార్మినార్ చెంత కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందజేశారు. లోకకల్యాణం కోసం, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను ప్రార్థించినట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఆమె సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. జశోదాబెన్ రాకతో ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆమెను చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. సాధారణ భక్తురాలిలాగే ఆలయ పరిసరాల్లో సంచరించడం, భక్తులతో చిరునవ్వుతో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. పర్యటన పొడవునా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాయంత్రం వరకు నగరంలోని మరికొన్ని ప్రాంతాలను సందర్శించిన ఆమె, తన ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఆమె వెంట కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు ఉన్నారు.