Mahaa Daily Exclusive

  బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత

Share

  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కన్నుమూత
  • ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి
  • సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

ఢాకా, మహా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి ఖలీదా జియా మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్స్పెక్షన్ రావడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆమె ఆరోగ్యం రోజు రోజుకూ మరింత వేగంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ.. మంగళవారం ఉదయం 6:00 గంటలకు తుది శ్వాస విడిచారు.. 1945 ఆగస్టు15న అవిభక్త భారతదేశంలోని పశ్చిమ్ బెంగాల్లో జన్మించిన ఖలిదా జియా,బీఎన్పీ ఛైర్‌పర్సన్‌ గా ఆ దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేశారు. బంగ్లా విమోచన యుద్ధంలో ఆమె భర్త జియావుర్ రెహమాన్ పాక్‌పై తిరుగు బాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1981లో ఆయన హత్యకు గురికావడంతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ అధ్యక్షురాలిగా ఖలీదా పగ్గాలు చేపట్టారు. పదేళ్ల తర్వాత ప్రధాని అయిన ఆమె.. 1991-96, 2001-06 మధ్య కాలంలో పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ దేశంలో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారామె. ఖలీదా ప్రధానిగా ఉన్న కాలంలో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో బీఎన్పీని భారత్ వ్యతిరేక పార్టీగా కొందరు పరిగణించారు. ఓ అవినీతి కేసులో 2018 నుంచి 2020 మధ్య జైలు జీవితం అనుభవించారు.

ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బీఎన్​పీ చీఫ్ ఖలీదా జియా మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఖలీదా జియా మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్‌ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖలీదా జియా లేనిలోటును ధైర్యంతో అధిగమించే శక్తిసామర్థ్యాలను ఆమె కుటుంబానికి ఇవ్వాలని ఎక్స్ వేదికగా ప్రధాని దేవున్ని ప్రార్థించారు. బంగ్లా తొలి మహిళా ప్రధాని తన మాతృభూమి అభివృద్ధి కోసం, భారత్‌- బంగ్లా మధ్య సంబంధాల కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2015లో ఖలీదా జియాను కలిసిన నాటి ఫొటోలను మోదీ ట్వీట్​కు జత చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం ఖలీదా జియా మృతిపై విచారం వ్యక్తం చేశారు.

“ఖలీదా జియా మృతి చెందారని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆమె కుటుంబానికి, బంగ్లాదేశ్ ప్రజలందరికీ మా ప్రగాఢ సానుభూతి. ఈ నష్టాన్ని భరించే శక్తిని దేవుడు ఆమె కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నా. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆ దేశ అభివృద్ధికి, రెండు దేశాల సంబంధాల బలోపేతానికి ఆమె చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. 2015లో ఢాకాలో ఆమెతో జరిగిన ఆత్మీయ సమావేశం ఇప్పటికీ గుర్తుంది. ఆమె దూరదృష్టి, వారసత్వం రెండు దేశాల సంబంధాలకు భవిష్యత్తులో కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తున్నాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.