- బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకం
- మరో హిందువు కాల్చివేత
- మైమెన్‌సింగ్‌లో దారుణం
- సహోద్యోగే హంతకుడు
ఢాకా, మహా : బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా మైమెన్‌సింగ్ జిల్లాలో ఒక హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 40 ఏళ్ల బజేంద్ర బిస్వాస్‌ను తనతో పాటు పనిచేసే సహోద్యోగే తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదిక ప్రకారం.. మైమెన్‌సింగ్‌లోని బాలుకా ఉపజిల్లాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. బాధితుడు బజేంద్ర బిస్వాస్‌ను నోమన్ మియా అనే వ్యక్తి కాల్చి చంపాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం వీరిద్దరూ సహోద్యోగులని తెలుస్తోంది. ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వ్యక్తిగత కక్షల వల్ల ఈ ఘటన జరిగిందా లేదా దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నిందితుడి అరెస్ట్
ఈ కాల్పుల ఘటన తర్వాత స్థానిక పోలీసులు వేగంగా స్పందించి నిందితుడు నోమన్ మియాను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య జరిగిన విషయాన్ని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తాత్కాలిక సెక్రటరీ జనరల్ మనీంద్ర నాథ్ ధ్రువీకరించారు. “అవును, ఈ విషాద ఘటన జరిగింది నిజమే” అని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరుగుతున్న వరుస దాడులు, హత్యల నేపథ్యంలో ఈ ఘటన మైనారిటీ వర్గాల్లో మరింత అభద్రతా భావాన్ని నింపింది. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.







