మే 4 నుంచి ఈఏపీసెట్
మే 12 న ఎడ్ సెట్. 13, 14 తేదీల్లో ఐసెట్, 18 న లా సెట్
పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
హైదరాబాద్, మహా : ఇంజినీరింగ్, ఫార్మా , అగ్రికల్చర్ సహా పలు కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ని తెలంగాణ ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. సోమవారం ఆయా పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి తాజాగా పరీక్షల షెడ్యూల్ ని ప్రకటించింది. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ పరీక్షను జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9వ తేదీ నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
మే 12 వ తేదీన బీఈడీలో ప్రవేశాల కోసం ఎడ్సెట్, మే 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ పరీక్షని షెడ్యూల్ చేస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇక మే 15న బీఈ, బీటెక్, బీ ఫార్మా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చే వారి కోసం టీజీఈసెట్, మే 18న ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల కోసం టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మా, ఎంఆర్క్, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు పీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు పేర్కొంది.








