- మూసీలో కాలుష్యం కంటే కొందరి కడుపులో ఎక్కువ విషం ఉంది
- ప్రజలకు నీటిని అందించాలని చూస్తుంటే కొందరు విషం కక్కుతున్నారు
- అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవం ప్రాజక్టుపై చర్చ
- ప్రతిపక్షంపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా : మూసీని అభివృద్ధి చేస్తుంటే కొందరు విషం కక్కుతున్నారని, కలుషితమైన మూసీ నీళ్లలో కంటే వారి కడుపులో ఎక్కువ విషం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై శుక్రవారం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మానవ నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తూ, కాకతీయుల నుండి నిజాంల వరకు అందరూ నీటి అవసరాల కోసం ప్రాజెక్టులను నిర్మించారని పేర్కొన్నారు.
వరదల ప్రభావంతో హైదరాబాద్‌లో జంట జలాశయాలు
1908 వరదల అనంతరం నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నేటికీ హైదరాబాద్ దాహార్తిని తీరుస్తున్నాయని, అయితే ఆగర్భ శ్రీమంతుల ఫామ్ హౌస్ ల డ్రైనేజీ వల్ల ఇవి కలుషితం కాకుండా తమ ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా లండన్ లోని థేమ్స్, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు తమ నదీ పరివాహక ప్రాంతాలను ఎలా కాపాడుకున్నాయో వివరించిన సీఎం రేవంత్ రెడ్డి, గుజరాత్‌లోని సబర్మతీ, యూపీలోని గంగా నది ప్రక్షాళనను తాము ఎన్నడూ తప్పుపట్టలేదని గుర్తుచేశారు.
మూసీ కాలుష్యంతో ప్రజలకు అనారోగ్యం..
మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు పడుతున్న బాధలను ప్రస్తావిస్తూ, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నది ఒడ్డున మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పరివాహకంలో నివసించే మహిళలు తల్లులు కాలేక పోవడానికి కారణాలు మూసి కాలుష్యమేనని వైద్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా గోదావరి జలాలను మూసీకి తరలించేలా 20 టీఎంసీల సామర్థ్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 15 టీఎంసీలు తాగునీటి అవసరాలకు, 5 టీఎంసీలు నదిలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ఉపయోగిస్తామని తెలిపారు. మూసా, ఈసా నదుల సంగమ ప్రాంతమైన బాపూఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ పేరుతో అద్భుతమైన పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడ డిఫెన్స్ భూముల బదలాయింపునకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని, మార్చి 31 లోపు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ సిటీ
పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న తరుణంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని, పాతబస్తీని ఒరిజినల్ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామని, అక్కడ శివాలయం, గురుద్వార్, మసీదు, చర్చిలను నిర్మించి మత సామరస్యాన్ని చాటుతామని చెప్పారు. విపక్షాలు తనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శించడంపై స్పందిస్తూ, రియల్ ఎస్టేట్ కూడా ఒక పరిశ్రమ అని, హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని గుర్తు చేశారు. మూసీ అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటామని, కడుపులో విషం పక్కనపెట్టి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.








