- కబ్జా కాదు
- నా స్వంత భూమి
- కావాలని కేసు పెట్టారు
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్, మహా : దుర్గం చెరువుకు సంబంధించి తనపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని గానీ, చెరువు భూమిని గానీ ఆక్రమించలేదని తెలిపారు. సంబంధిత భూమి పూర్తిగా తమ స్వంతమైందని, ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేలా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే టీడీఆర్ కూడా మంజూరు అయిందని తెలిపారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయన్నారు. దుర్గం చెరువులో తాను ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశానని కేసులు పెట్టారని, అయితే వాస్తవానికి అక్కడ తమకూ, ప్రభుత్వానికీ గజం జాగా కూడా లేదని స్పష్టం చేశారు.
హైడ్రా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని సిబ్బంది సమాచారం ఇచ్చారని, తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు. అదే ప్రాంతంలో ఉన్న మరో భూమిని తాను 2004లో కొనుగోలు చేశానని, అది ఎఫ్ టీఎల్ పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించానని తెలిపారు. తనపై కావాలనే రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ, “వారి వద్ద నిజమైన ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు చూపించాలి” అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.








