- బళ్లారిలో పొలిటికల్ ఫైట్
- గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం
- 11మందిపై ఎఫ్ ఐ ఆర్
మహా
కర్ణాటకలోని బళ్లారిలో గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు కార్యక్రమ బ్యానర్ల ఏర్పాటు విషయంపై గంగావతి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే జనార్ధన రెడ్డి, బళ్లారి నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. బళ్లారిలోని అవంభవి ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే జనార్ధన రెడ్డి నివాసం ఎదుట ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు యత్నించారు. దీనిపై ఇరువురు ఎమ్మెల్యేల అనుచరుల మధ్య తొలుత తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో అక్కడికి బీజేపీ నేత, మాజీ మంత్రి శ్రీరాములు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అనుచరులు భౌతికదాడులు చేసుకున్నారు. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ పడుతున్న వారిపై లాఠీ చార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ఓ వ్యక్తి జనార్ధన్ రెడ్డిపైకి కాల్పులు జరపబోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయాడని పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి బళ్లారిలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం రోజు బళ్లారి, గంగావతి పట్టణాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. బళ్లారి ఐజీపీ, ఎమ్మెల్యేలతో కర్ణాటక హోంమంత్రి, డీజీపీ ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నారు.







