- ప్రియాంక సారథ్యంలో
- కాంగ్రెస్ బిగ్ స్కెచ్
- ఐదు రాష్ట్రాలు.. విభిన్న వ్యూహాలు
- బెంగాల్ మినహా నాలుగురాష్ట్రాల్లో గెలిచేలా ఎత్తుగడలు
ఢిల్లీ, మహా
త్వరలో జరగనున్న ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. గతంలో లాగా కాకుండా.. ఈసారి సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్ళాలని డిసైడైంది. కాంగ్రెస్ కార్యకర్తలు నయా ఇందిరమ్మగా పిలుచుకునే ప్రియాంక సారథ్యంలో అసెంబ్లీ ఎన్నికల దుమ్ము దులపాలని, బిజెపి జోరుకు బ్రేకులు వేయాలని వ్యూహరచన చేస్తోంది. అసోంలో హిమంతబిశ్వశర్మను గద్దెదించే బాధ్యత తీసుకున్న ప్రియాంక గాంధీ.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తోంది. ప్రియాంకగాంధీ ప్రధాని కావాలని డిమాండ్ చేసిన ఎంపీలను ప్రియాంక ఛైర్మన్ గా ఉన్న అసోం అసెంబ్లీ అభ్యర్ధుల సెలక్షన్ కమిటీలో నియమించడం సరికొత్త పరిణామం. బిహార్, హర్యానాలలో దెబ్బతిన్న కాంగ్రెస్ ఇపుడు వ్యూహాలను మార్చుకుంటోంది. ఓట్ చోరీ, రాజ్యాంగ పరిరక్షణ అంశాలకంటే స్థానిక అంశాలపైనే అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాలని భావిస్తోంది. ఈసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలు ఐదు రాష్ట్రాలపై ప్రత్యేక స్కెచ్ తో ముందుకు సాగుతున్నట్లు తాజా సెలక్షన్ కమిటీలతో స్పష్టమైంది.
కాంగ్రెస్ ఆశలు వీటిపైనే
అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటికీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటుచేశారు. అందులో భాగంగా అసోం, బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి కోసం కమిటీలు ఏర్పాటుచేయగా, ఒక్కో కమిటీలో నలుగురు సభ్యులను నియమించారు. అందులో బాగంగానే ప్రియాంకను కీలక రాష్ట్రానికి ఛైర్ పర్సన్ గా నియమించారు.
ఈసారి లెక్క పక్కాగా..
కాంగ్రెస్ ఈసారి పక్కాగా లెక్కలతో ముందుకెళ్తోంది. గత కొన్నేళ్ళుగా కొరకరాని కొయ్యలా ఉన్న అసోంను ఈసారి కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో పొత్తుపెట్టుకొని బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అందుకే చాలా పకడ్బందీగా స్క్రీనింగ్ కమిటీలో ప్రియాంక గాంధీతోపాటు, ఆమె సన్నిహితులైన లోక్ సభ ఎంపీలైన ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక, సిరివెళ్ల ప్రసాద్‌లను సభ్యులుగా నియమించింది.
కేరళ స్క్రీనింగ్ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీని ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో రాజ్యసభ ఎంపీలు సయ్యద్ నసీర్ హుస్సేన్, నీరజ్ డాంగి, అభిషేక్ దత్ సభ్యులుగా ఉన్నారు.
తమిళనాడు, పుదుచ్చేరి కమిటీలకు ఛత్తీస్‌గఢ్ మాజీ ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఛైర్మన్‌గా ఉన్నారు. ఇందులో యశోమతి ఠాకూర్, జి.సి. చంద్రశేఖర్, అనిల్ కుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి బి.కె. హరిప్రసాద్ నేతృత్వం వహిస్తారు. ఆ కమిటీలో మహమ్మద్ జావేద్, మమతా దేవి, బి.పి.సింగ్‌లు సభ్యులుగా ఉన్నారు.
సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు/ ఇన్ఛార్జ్లు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ కార్యదర్శులు పదవి రీత్యా తమ తమ రాష్ట్రాల స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ఫిబ్రవరిలో షెడ్యూల్?
కేరళ, బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మార్చి-మే మధ్య జరగనున్నాయి. 126 మంది సభ్యులున్న అసోం అసెంబ్లీకి ఈ ఏడాది మార్చి – ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి.
రాష్ట్రాల్లో పొత్తు వ్యూహాలు
ప్రస్తుతం అసోంలో బీజేపీ అధికారంలో ఉంది. దాని నుంచి అధికారం చేజిక్కించుకోవడానికి, కాంగ్రెస్, సీపీఐ(ఎం), రైజోర్ దళ్, అసోం జాతీయ పరిషత్ (ఏజేపీ), సీపీఐ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, జాతీయ దళ్-అసోం (జేడీఏ), కర్బీ ఆంగ్లాంగ్కు చెందిన ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఏపీహెచ్ఎల్సీ) పార్టీలు చేతులు కలిపాయి. ఆ పార్టీలన్నీ కలిసి ఒకే వేదిక నుంచి అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీకి 64 మంది సభ్యులు ఉండగా, దాని మిత్రపక్షాలపై ఏజీపీకి 9, యూపీపీఎల్‌కు 7, బీపీఎఫ్‌కు 3 సభ్యులు ఉన్నారు. ఇక, విపక్ష శిబిరంలో కాంగ్రెస్‌కు 26, ఏఐయూడీఎఫ్‌కు 15, సీపీఐ(ఎం)కు 1 ఎమ్మెల్యే ఉన్నారు. వీరితోపాటు ఒక స్వతంత్ర శాసన సభ్యుడు కూడా అసోం అసెంబ్లీలో ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్ధులను పకడ్బందీగా ఎంపిక చేసుకుని, మిత్రపక్షాలను కరెక్ట్ గా డీల్ చేస్తే అధికారం చేజిక్కించుకోవడం కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. అసోంలో కాంగ్రెస్ ఎదురుదెబ్బలు తిన్నా బలంగా ఉంది.
– తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలో ఉంది. అక్కడ పాగా వేయడానికి ఓ పక్క బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తును బిజెపి కుదుర్చుకుంది. ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ మాత్రం, కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌కు అది చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు డీఎంకేతో పొత్తుకు మొగ్గుచూపుతున్నారు. అయితే విజయ్ తో పొత్తుద్వారా కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని, మళ్ళీ పార్టీ విస్తరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
– కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో బీజేపీ కీలక స్థానాల్లో విజయం సాధించి, మంచి ఊపుమీద ఉంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇప్పటి నుంచే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతోంది. యుడీఎఫ్ కేసీ వేణుగోపాల్ సారధ్యంలో అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. బిజెపి ఎల్ డిఎఫ్, యూడీఎఫ్ లకు భిన్నమైన స్ట్రాటజీలతో ముందుకు వెళ్తోంది.
– ప్రస్తుతం పుదుచ్ఛేరిలో ఎన్.రంగస్వామికి చెందిన ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది. అయితే డీఎంకే, కాంగ్రెస్‌ల కూటమి ఇక్కడ చాలా బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని ముందు నుంచే వ్యూహాలు రచిస్తోంది.
– పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా ఉంది. కాంగ్రెస్ ఇక్కడ బలహీనపడింది. పొత్తులు పెట్టుకుని బలం పెంచుకునే వ్యూహంతో ఉంది. జాతీయస్థాయి రాజకీయాలు ఇక్కడ న్రభావం చూపనున్నాయి.
– మొత్తంగా ఐదు రాష్ట్రాలనై సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక స్కెచ్ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.







