- హైదరాబాద్ లో చంద్రబాబు
- టీడీపీ నేత సాయిబాబా కుటుంబానికి బాబు పరామర్శ
- పార్టీ ఆవిర్భావం నుండి ఆఖరిశ్వాస వరకు పార్టీతోనే
హైదరాబాద్, మహా : సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మృతితో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ ఆఫీస్కు ఎప్పుడు వెళ్లినా.. తనకు ఆయన స్వాగతం పలికేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేశారని వివరించారు. ఆదివారం హైదరాబాద్లో పిన్నమనేని సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన తన కుటుంబం కోసం కాకుండా పార్టీ కోసం పని చేసిన వ్యక్తి సాయిబాబా అని గుర్తు చేసుకున్నారు. సాయిబాబా కుటుంబానికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత.. పార్టీ అధినేతగా ఆ కుటుంబ పెద్దగా తాను తీసుకుంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సాయిబాబా కుటుంబానికి ఈ సందర్భంగా ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం తనకు చాలా బాధ కలిగిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి శనివారం వరకు .. చివరి శ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసం పని చేసిన వ్యక్తి పిన్నమనేని సాయిబాబా అని వివరించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఆయన అభిమానిగా పార్టీలో చేరడం.. నాటి నుంచి అనునిత్యం పార్టీ కోసం పని చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం పిన్నమనేని సాయిబాబు ఎనలేని సేవలు అందించారన్నారు. చివరి రోజుల్లో నడవ లేని పరిస్థితుల్లో వీల్ చైర్లో వచ్చి పార్టీ ఆఫీస్లో కుర్చొనే వారన్నారు. పార్టీ కోసం ఒక కమిట్మెంట్తో పని చేసిన వ్యక్తి పిన్నమనేని సాయిబాబా అని చెప్పారు.








