ఉత్తరాంధ్ర కల సాకారం.. భోగాపురంలో తొలి విమానం
కీలక మైలురాయి : సీఎం చంద్రబాబు
విశాఖ, మహా
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం తొలి విమానం ల్యాండ్ అయింది. వ్యాలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ ఛైర్మన్ తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ఈ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. 2015 లో ఈ వియానాశ్రయానికి చంద్రబాబు పట్టుదల, ముందుచూపుతో శ్రీకారం చుట్టగా, ఇపుడు రెండోసారి ప్రభుత్వం రాగానే త్వరితగతిన పూర్తవుతోంది.
చంద్రబాబు హర్షం
భోగాపురంలో తొలి విమానం ల్యాండ్ కావడం ఎయిర్‌పోర్ట్ చరిత్రలో కీలక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఆదివారం భోగాపురం ఎయిర్ పోర్ట్‌లో తొలి విమానం ల్యాండ్ కావడంపై సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఏపీ విమానయాన రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. వ్యాలిడేషన్ ప్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ అనుసంధానం (కనెక్టివిటీ) బలోపేతం అవుతుందని.. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీగా ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు మద్దతు అందించిన ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ప్రజల సేవలకు విమానాశ్రయం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ ఎయిర్ పోర్ట్ ద్వారా వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఎయిర్ పోర్ట్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ముందే భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తికానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.








