Mahaa Daily Exclusive

  వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా వస్తా: బీఆర్ఎస్‌పై కవిత నిప్పులు, కొత్త పార్టీ ప్రకటన!

Share

  • మండలిలో కవిత కంటతడి
  • వ్యక్తిగా వెళ్తున్నా బలమైన శక్తిగా వస్తా
  • రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్ ను కోరిన కవిత
  • బీఆర్ఎస్ తో నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మ గౌరవ పంచాయతీ అని వ్యాఖ్య
  • ఉద్యమ ద్రోహులకు కేంద్రంగా మారిన బీఆర్ఎస్
  • రాజకీయ పార్టీగా మారనున్న తెలంగాణ జాగృతి
  • కీలక వ్యాఖ్యలు చేసిన కవిత

హైదరాబాద్, మహా : శాసనమండలిలో కల్వకుంట్ల కవిత కంటతడి పెట్టుకున్నారు. ఛైర్మన్ ప్రత్యేక అనుమతితో మాట్లాడిన కవిత ఇదే తన చివరి ప్రసంగం అని భావోద్వేగానికి గురయ్యారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని, బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి వస్తానని శపథం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించామన్నారు కవిత. అప్పటి నుంచి ఇక తనపై ఆంక్షలు మెుదలైనట్టుగా తెలిపారు. వ్యక్తి స్వేచ్ఛను ఎలా హరిస్తారనే బాధ, ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. బీఆర్ఎస్‌లో తనకు ఏ బాధ్యత ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేసినట్టుగా కవిత గుర్తుచేసుకున్నారు. పార్టీలో ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారన్నారు. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే ఇక రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో తనకు ఘోర అవమానాలు జరిగాయన్నారు. ఈడీ, సీబీఐలతో పోరాడే సమయంలో పార్టీ, పార్టీ నేతలు తనకు అండగా నిలవలేదన్నారు. కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టిందని వ్యాఖ్యానించారు.

‘కేసీఆర్‌ను కాపాడుకోలేని పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? హరీశ్ రావు అవినీతి పరుడు. బీఆర్ఎస్ పార్టీలో రాజ్యాంగం పెద్ద జోక్. పార్టీ నడిపే పద్ధతి ఇది కాదు. నైతికత లేని పార్టీ బీఆర్ఎస్. కనీసం సంజాయిషీ కూడా అడగకుండా నన్ను సస్పెండ్ చేశారు. నా ఇద్దరి కొడుకుల మీద ఒట్టు వేసి చెప్తున్న బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు. ఆత్మగౌరవ పంచాయితీ.’ అని కవిత వ్యాఖ్యానించారు. పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించా అని కల్వకుంట్ల కవిత అన్నారు. అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు అన్ని నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికి మునిగిపోయాయని చెప్పారు. ఇసుక దందాల కోసమే నేరెళ్ల దురాగతం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోవడం అవమానకరం అని చెప్పారు.

తెలంగాణలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి మారుతుందన్నారు. ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. ‘అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీ కోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతాను. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను.’ అని కవిత మాట్లాడారు.

Latest