- తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం
- బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసేస్తే
- ఏడాది కాంగ్రెస్ పాలనలో 1500 స్కూల్స్ మూసేశారు
- విద్యార్థులను ఇబ్బంది పెడితే వాళ్ల పక్షాన ఉద్యమిస్తా
- దేశంలో నల్లజెండాలు ఎగరేసేది టెర్రరిస్టులు, నక్సలైట్లు మాత్రమే
- ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్
- అమరుల త్యాగాల స్పూర్తితోనే మోదీ సర్కార్ 370 ఆర్టికల్ రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మించింది
హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేస్తే… కాంగ్రెస్ పాలనలో వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే 1500 స్కూల్స్ మూసివేశారన్నారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని గాలికొదిలేశారని, ఫీజు రీయంబర్స్ మెంట్ రాక కాలేజీలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ కోసం తాము మద్దతిచ్చినా కొన్ని కాలేజీ యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వానికి భయపడి రాజీ పడుతున్నాయన్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విషయంలో విద్యార్ధులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యా సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్ లో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం హాజరై మాట్లాడారు. ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ‘జనమంచి గౌరీశంకర్ జీ’ యువ పురస్కార్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. జనమంచి గౌరీశంకర్ వ్యక్తి. విద్యార్థులకు ఐకాన్. ఇంటిపేరును సార్ధకం చేసుకున్న జనం మనిషి గౌరీజీ అని అన్నారు. ఏబీవీపీయే ఆయన జీవితం. బాల్యం నుండి చనిపోయేదాకా ఏబీవీపీకే సిద్దాంతాలకే అంకితమైన నాయకుడని, ఎమర్జెన్సీ టైంలో జైలుకు పోయిన గౌరీజీ ఉమ్మడి ఏపీలో విద్యార్ధి పరిషత్ ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసిన వ్యక్తి అని అన్నారు. విద్యార్థి నాయకులకు శిక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, క్యాపిటేషన్ ఫీజులకు వ్యతిరేకంగా, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం అనేక రూపాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారన్నారు. 1983 లో నక్సల్స్‌కు వ్యతిరేకంగా తొలి ఉద్యమం ప్రారంభించిన ఏబీవీపీ నాయకుడు గౌరీశంకర్ ఉగ్రవాదంపై కూడా విద్యార్థులను చైతన్య పరిచారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడారుని, ఎంతో మంది విద్యార్ధి నాయకులను నక్సల్స్ చంపినా.. వారి శవాలను తన భుజాలపై మోసిన గౌరీజీ… ఒక్కరు చనిపోతే.. వందల మంది ఏబీవీపీ నాయకులను తయారు చేసిన లీడర్ అని కొనియాడారు. పోస్టర్లు వేసి డేట్ వేసి ఫలానా టైంలో చంపుతామంటూ నక్సల్స్ హెచ్చరించినా సామా జగన్మోహన్ వంటి ఏబీవీపీ నాయకులెవరూ పారిపోలేదని, చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగం చేసిన నాయకులు ఏబీవీపీలో ఉన్నారన్నారు. దేశాన్ని సరిహద్దులో జవాన్లు రక్షిస్తే దేశంలో విద్యార్ధి పరిషత్ నాయకులు దేశరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నారన్నారు. నక్సలైట్లు నల్ల జెండా ఎగరేస్తే వారిని ఎదిరిస్తూ జాతీయ జెండా ఎగరేసిన నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి, నక్సలైట్లు బుల్లెట్ల వర్షం కురిపించినా భారతమాతాకీ జై అంటూ… చివరి శ్వాస వదిలిన నాయకుడు సామ జగన్మోహన్ రెడ్డి అని గుర్తించారు.
ఒకనాడు గ్రామాల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్త తిరిగి వస్తారో లేదో, నక్సల్స్ తూటాలకు బలైతారేమోనని క్షణక్షణం ఆందోళన పడ్డ క్షణాలు ఇప్పుడు లేవని, బూజుపట్టిన సిద్దాంతం పేరుతో పేదలను, గిరిజనులను, ఏబీవీపీ కార్యకర్తలను చంపుతున్న నక్సల్స్ ను ఏరివేస్తున్న మహానాయకుడు మోదీ అని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో అమిత్ షా ఆధ్వర్యంలో 2026 మార్చి నాటికి ‘నక్సల్స్ ముక్త్ భారత్’ తథ్యం. భయపడే పరిస్థితే లేదన్నారు. నక్సల్స్ కు వ్యతిరేకంగా విద్యార్ధి పరిషత్ చేతులకు బుల్లెట్లు ఇచ్చి ఉంటే ఎప్పుడో వారిని అంతం చేసే వారని, కానీ గౌరీజీ ఏనాడూ విద్యార్ధులకు బుల్లెట్ పాఠాలు బోధించలేదన్నారు. బ్యాలెట్ ను నమ్మకుని పనిచేయాలని నిరంతరం నూరిపోశారని, అందుకే బ్యాలెట్ నమ్ముకున్నోడు ఉన్నతంగా ఎదిగారు. బుల్లెట్ ను నమ్ముకున్నోళ్లు అంతరించిపోయారన్నారు.
కశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని కోరితే తల్లిదండ్రుల ఎదుటే పిల్లలను కట్టేసి చంపేసిన ఉగ్రవాదుల దుర్మార్గాలను మర్చిపోలేమన్నారు. దేశం కోసమే పనిచేస్తున్నామని చెప్పే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఎన్ఎస్ యూఐ, ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్ధి సంఘాలు ఎందుకు ఆర్టికల్ 370 రద్దు కోసం ఎందుకు పోరాటాలు చేయలేదు? దేశం కోసం ఎందుకు ఉద్యమించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జనసంఘ్ నాయకులు మాత్రమే 370 ఆర్టికల్ కోసం పోరాడారని, శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి వారు బలిదానం చేశారన్నారు. వారి త్యాగాలు వృధా పోకూడదనే మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ ను రద్దు చేశారన్నారు. పార్లమెంట్ లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో తానూ ఉండటంతో తన జన్మ ధన్యమైందన్నారు. 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన సాధ్వీ ప్రజ్ఝాసింగ్ ను అనేక చిత్రహింసలు పెట్టారని, ఆమె శరీరంలో పోలీసులు కొట్టని, కరెంట్ షాక్ ఇవ్వని పార్ట్ లేదన్నారు. 80 శాతం హిందువులున్న భారత్ లో వాళ్లకు నిత్యం కొలిచే రాముడి మందిరాన్ని అయోధ్యలో నిర్మించలేకపోతున్నారని ప్రపంచమంతా హేళన చేశారన్నారు. అట్లాగే అయోధ్య రామమందిరంలో కరసేవకుల త్యాగాలు, బలిదానాలు వృధా కావొద్దని రామ మందిరాన్ని నిర్మించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని అన్నారు.
ఈ దేశంలో ఎలాంటి సమాజం నిర్మాణం కావాలో ఒక్కసారి ఆలోచించాలని కోరిన బండి సంజయ్ ఒకనాడు ఏబీవీపీ కార్యకర్తలు గోడలపై వాల్ పోస్టర్ రాయాలంటే… కాల్చేసిన బీడీని ఇంకులో ముంచి, పాత బట్టతో జాజులో ముంచి రాసేవాళ్లమన్నారు. మా అక్క పెళ్లి టైం ఒకవైపు మాకు ఎగ్జామ్స్ ఇంకోవైపు… ఆ టైంలో కూడా కాలేజీ గోడలపై వాల్ రైటింగ్ రాసిన జ్ఝాపకాలు గుర్తుకొస్తున్నాయని సంజయ్ నెమరు వేసుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నక్సలైట్ల, టెర్రరిస్టుల సమస్య లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం విద్యా రంగ సమస్యలతో అల్లాడుతోందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో క్లాస్ రూముల్లో చీకటి రాజ్యమేలుతోందని, స్కూళ్లో టీచర్ లేడు. టాయిలెట్లు లేవు. బెంచ్ లు లేవు. అయినా ఈ ప్రభుత్వానికి సిగ్గు కూడా లేదన్నారు. ఒక ప్రభుత్వం విఫలమైతే ఒక ఎన్నిక పోతుంది, విద్య విఫలమైతే – ఒక తరం పోతుంది! కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో రెండు తరాలు నష్టపోయేంతగా విద్యా వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు.
కాంగ్రెస్ ను గెలిపించిన పాపానికి వేలాది టీచర్ పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయని, స్కావెంజర్స్ లేక ఊడ్చేవాడు లేక స్కూళ్లు అల్లాడుతున్నాయన్నారు. టీచర్లు, సౌకర్యాల్లేక పోవడంతో 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 2 వేల 81 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో మూసివేసిన 6 వేల పాఠశాలలను తెరిపిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పని చేయకపోగా.. దాదాపు 1500 స్కూల్స్ ను మూసివేశారని మండిపడ్డారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. పోస్ట్ కార్డు కూడా ఇయ్యలే. ప్రతి విద్యార్ధికి ఇంటర్నెట్, వైఫై సౌకర్యం కల్పిస్తామన్నారు. కరెంట్, నీళ్లు, సరైన తిండికి దిక్కులేక హాస్టల్ విద్యార్థులు అల్లాడుతూ ఫుడ్ పాయిజన్ తో వందలాది మంది చనిపోతున్నా గాలికొదిలేసినోళ్లు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం సిగ్గు చేటు.. 18 ఏళ్లు దాటిన యువతులకు స్కూటీ ఇస్తామన్నారు. ఊసే లేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.15 వేలు, ఇంటర్ చేస్తే రూ.25 వేలు, డిగ్రీ చేస్తే రూ.50 వేలు, పీజీ చేస్తే రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాది వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ భర్తీ చేస్తామని చేయలేదని, ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదని, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, సాంపుల్ ఇంప్లిమెంటేషన్‌కే పరిమితమైందని, ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని పేర్కొన్నారు. విద్యా రంగంలో ఇన్ని సమస్యలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు.







