- ఫోన్ ట్యాపింగ్ కేసులో
- హరీష్ రావుకు బిగ్ రిలీఫ్
- విచారణ అవసరం లేదన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మహా : సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ అవసరం లేదని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్‌ను ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలను వినిపించారు.
మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ కాల్స్‌ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీష్ రావు, ఆయన వ్యక్తిగత సహాయకుడు వంశీ కృష్ణ, అనేక మందిపై కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టు వెళ్లారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని, ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ హైకోర్టు మార్చి 2025లో తీర్పు ఇచ్చింది. తరువాత చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు క్వాష్ చేయగా అందులో జోక్యం చేసుకోలేమని, విచారణ అవసరం లేదని పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.







