- వివాదాలు కాదు
- రెండు రాష్ట్రాలు జలవనరులను సమర్థంగా వాడుకోవాలి
- జల వివాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి, మహా : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన, రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన బంధం మ, భవిష్యత్తు లక్ష్యాలపై కీలక ప్రసంగం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, విభజన సమస్యల కంటే సయోధ్యే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కాళేశ్వరం కట్టినా నేను ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. గోదావరి జలాలను తెలంగాణ వాడుకుంటే తెలుగు ప్రజలకే మేలు జరుగుతుందని భావించాను అని ఆయన పేర్కొన్నారు. నీటి వినియోగం విషయంలో రాష్ట్రాల మధ్య గొడవలు కాకుండా, వనరులను సమర్థవంతంగా వాడుకోవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.
జల వనరుల విషయంలో నదుల అనుసంధానం జరగాల్సి ఉందన్నారు. గంగా – కావేరి నదుల అనుసంధానం జరగాలని, తద్వారా దేశమంతా సస్యశ్యామలం కావాలని చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాలు నీటి గొడవల్లో చిక్కుకోకుండా, పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అగ్రగామిగా ఉండాలన్నదే తన తపన అని ఆయన అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగు జాతి అత్యంత శక్తివంతమైన జాతిగా ఎదగాలి. విద్వేషాలతో సమయాన్ని వృథా చేసుకోకుండా, సమైక్యతతో అభివృద్ధి పథంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉండాల్సింది సయోధ్యే కానీ విద్వేషాలు కాదు. జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడాలి తప్ప, ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పినట్లయింది.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించని బాబు
కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగిేషన్ ఆగిపోయిందని ప్రకటించారు. అదే సమయంలో ఒక్క చుక్క కూడా ఏపీ వాడుకోకుండా చూస్తామని సవాల్ చేశారు. దీంతో రాజకీయ దుమారం రేగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ఆగిపోయిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి మాత్రం ఈ అంశంపై నేరుగా స్పందించలేదు. రెండు రాష్ట్రాలు వనరుల్ని సమర్థంగా వాడుకోవాలన్నదే తన అభిమతమని ఆయన చెబుతున్నారు. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడంలేదు. గోదావరిపై కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలని సలహా ఇస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు, రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఏపీ జల దోపిడీ చేస్తోందని ఆరోపిస్తోంది. దీంతో ఈ జల వివాదం అంతకంతకూ పెరిగి పెద్దదవుతోంది.







