అమలాపురం, మహా
కోనసీమ జిల్లా, మలికిపురం మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీకై భారీగా మంటలు చెలరేగడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై సమీక్ష జరిపారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా స్పందించారు. ఆయన కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓఎన్జీసీ అధికారులతో మాట్లాడారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఓఎన్జీసీ నిపుణులతో సమన్వయం చేసుకుని మంటలను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావాలని సూచించారు. గ్యాస్ ప్రభావం ప్రజలపై పడకుండా ముందుజాగ్రత్తగా అందరికీ మాస్కులు పంపిణీ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.








