Mahaa Daily Exclusive

  రూ. 850 కోట్ల డిజిటల్ డిపాజిట్ల కుంభకోణం: ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను అరెస్ట్ చేసిన సీఐడీ

Share

  • డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం
  • ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
  • ముంబై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సీఐడీ

హైదరాబాద్, మహా : హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.850 కోట్లను వసూలు చేసినట్లు అమర్‌దీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడు తన భార్యతో కలిసి దుబాయ్‌కు పరారయ్యాడు. దీంతో పోలీసులు అమర్‌దీప్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆయన గల్ఫ్ దేశాల నుండి ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే, ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తెలంగాణ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐడీ బృందం ముంబైకి వెళ్లి అమర్‌దీప్‌ను అదుపులోకి తీసుకుంది.

పెట్టుబడుల పేరుతో మోసాలు

ఫాల్కన్ సంస్థ ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సామాన్య ప్రజలను మభ్యపెట్టి భారీగా డిపాజిట్లు సేకరించింది. ఈ యాప్ ఆధారిత పెట్టుబడుల స్కామ్‌లో ఇప్పటికే సంస్థ సీఈవో అమర్‌దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దారి మళ్లించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అమర్‌దీప్ అరెస్ట్‌తో ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.