Mahaa Daily Exclusive

  కరూర్ తొక్కిసలాట ఘటన: నటుడు విజయ్‌కు సిబిఐ షాక్.. జనవరి 12న విచారణకు హాజరుకావాలని సమన్లు

Share

  • కరూర్ తొక్కిసలాట ఘటన
  • నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు
  • ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

న్యూఢిల్లీ, మహా : తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ‘తమిళ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత, నటుడు విజయ్‌కు సిబిఐ షాక్ ఇచ్చింది. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. నటుడు విజయ్ సభకు ఆలస్యంగా రావడంతో జనాలు అధికంగా పోగవడంతో తొక్కిసలాట జరిగిందని, సరైన నీటి సదుపాయం లేక చాలా మంది డీహైడ్రేషన్‌కు గురై మరణించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 12వ తేదీన ఢిల్లీలోని తమ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని విజయ్‌కు సిబిఐ సమన్లు జారీ చేసింది. కరూర్ ఘటనపై నటుడు విజయ్‌కి నోటీసులు జారీ కావడం తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తోంది. రిటైర్డ్ జడ్జి అజయ్ రస్తోగి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు సుమిత్ చరణ్, సోనల్ మిశ్రా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే కరూర్ ఎస్పీ సహా పలువురు పోలీసు అధికారులను, బాధిత కుటుంబాలను సిబిఐ విచారించింది. సభ నిర్వహణలో పోలీసుల భద్రతా లోపాలు ఉన్నాయా లేదా పార్టీ నిర్వాహకుల ప్రణాళికా లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో కరూర్ సంఘటనకు సంబంధించి టీవీకే పార్టీ కార్యనిర్వాహకులు ఎన్. ఆనంద్, అధవ్ అర్జున, సిటిఆర్ నిర్మల్ కుమార్ లను సిబిఐ విచారించగా, తాజాగా విజయ్ ను విచారణకు హాజరు కావాలని సమన్లు ​​జారీ చేసింది. తన చివరి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ కి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయని దళపతి ఫ్యాన్స్ అంటున్నారు. కరూర్ తొక్కిసలాట సంఘటనలో ఢిల్లీ, కరూర్ లలో ఏకకాలంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది.