Mahaa Daily Exclusive

  నీళ్లపై రాజకీయాలు వద్దు: తెలంగాణతో చర్చలకు సిద్ధం – సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Share

  • నీళ్లపై రాజకీయాలు సరి కాదు
  • పోటాపోటీగా మాట్లాడొద్దు
  • కృష్ణా, గోదావరి నధుల అనుసంధానంపై తెలంగాణతో చర్చలకు సిద్దం
  • పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏలూరు, మహా : నీళ్లపై రాజకీయాలు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్ ను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లపై పోటాపోటీగా మాట్లాడటం సరి కాదన్నారు. తెలంగాణ గోదావరి నీటిని మంజీరాకు మళ్లించినప్పుడు కూడా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. నీటి విషయంలో గొడవలు పడటం వల్ల రెండు రాష్ట్రాలూ నష్టపోతాయని, సామరస్య పూర్వక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం , నీటి లభ్యతపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాయలసీమతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా మేలు జరుగుతుందని బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. విభజన సమస్యలు ఉన్నప్పటికీ, సాగునీటి విషయంలో మొండివైఖరి ప్రదర్శించకుండా, ఉమ్మడి ప్రయోజనాల కోసం అడుగులు వేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదని, ఇది దేశానికే గర్వకారణమైన బహుళార్థసాధక ప్రాజెక్టు అని ఆయన నొక్కి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల ఆలస్యం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, రాష్ట్ర రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలకు మరియు సరిహద్దు రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా శాస్త్రీయంగా మేనేజ్‌మెంట్ చేస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు అనేది ఉండదని, గోదావరి జలాలను ఒడిసి పట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Latest