హైదరాబాద్, మహా : వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ ఫీల్డ్‌లో యువత కెరీర్లను నిర్మించుకోవడానికి, నైపుణ్య ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ), క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్ ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి. రెండింటి మధ్య సహకారం రాష్ట్రంలోని 5 వేల మందికి పైగా యువతకు శిక్షణ ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు. తద్వారా వారికి ఉపాధి లభించనుంది. స్కిల్స్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ సుబ్బారావు, స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
ఇందులో భాగంగా ఇన్‌స్టామార్ట్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్విక్ కామర్స్‌లో ఉద్యోగ సంబంధిత కార్యాచరణ, నిర్వాహక నైపుణ్యాలను పెంపొందించడానికి మూడు నెలల అభ్యాస కార్యక్రమాన్ని ప్రవేశపెడతాయి. ప్రత్యేకించి శిక్షణలో డార్క్ స్టోర్ లేదా రిటైల్వేర్ కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ఈ కార్యక్రమం క్లాస్ రూమ్‌లో బోధన మాత్రమే కాకుండా.. ఫీల్డ్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. కోర్సు, ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేయడం వల్ల విద్యార్థులు స్టోర్ మేనేజర్ ట్రైనీలు వంటి పాత్రల్లోకి వేగంగా చేరుకుంటారు.
క్విక్ కామర్స్ రంగంలో కీలకమైన డార్క్ స్టోర్ ఆపరేషన్లు, సరఫరా గొలుసు నిర్వహణ, కస్టమర్ సర్వీస్, రిటైల్ లాజిస్టిక్స్‌లో ఉద్భవిస్తున్న కొత్త ధోరణుల మీద ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత స్టోర్ మేనేజర్ ట్రెయినీ వంటి ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి. 5 వేల మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చి.. వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తారు. స్విగ్గీ లిమిటెడ్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గిరీష్ మీనన్ మాట్లాడుతూ, ‘ఈ సహకారం సరఫరా గొలుసు, క్విక్ కామర్స్ కార్యకలాపాలలో రియల్ టైమ్‌లో యువతను సిద్ధం చేసే అభ్యాస మార్గాలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది.’ అని అన్నారు.
ఇన్‌స్టామార్ట్ పరిశ్రమ నైపుణ్యం, బోధనా మద్దతు, గెస్ట్ ఫ్యాకల్టీని అందిస్తుంది. అయితే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ద్వారా విద్యా పర్యవేక్షణ, పాఠ్యాంశాల ఆమోదాన్ని అందిస్తుంది. ఈ భాగస్వామ్యంలో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్‌లోని స్కిల్స్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌లో ఇన్‌స్టామార్ట్ సపోర్ట్‌తో శిక్షణా ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కూడా ఉంటుంది.








