Mahaa Daily Exclusive

  తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ రఘునందన్ రావు ధీమా

Share

  • అధికారంలోకి వచ్చేది బీజేపీయే
  • పార్టీని వదిలిన వారు తిరిగి రండి
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
  • మా తప్పు వల్లే 2023లో రేవంత్ సీఎం అయ్యారు

హైదరాబాద్, మహా : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అందువల్ల బీజేపీని వీడిన వారు తిరిగి వెనక్కి రావాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా వైపు నుంచి జరిగిన ఒకటి అర సంఘటనల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప ఇది కాంగ్రెస్ బలమో, రేవంత్ రెడ్డి పోరాటమో కాదన్నారు. బీజేపీ అధికారానికి మరో 10 అడుగుల దూరంలో ఉందనగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి వంటి నాయకులు వేర్వేరు కారణాలతో బీజేపీని వీడటంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్‍కు వలసపోయిన నాయకులకు అక్కడ ఏం గుర్తింపు ఉందో ఓసారి ఆలోచన చేసుకోవాలన్నారు. భవిష్యత్‍లో తెలంగాణ సమాజం కోసం నిలబడేది బీజేపీ మాత్రమేనని అందువల్ల బీజేపీని వీడి కాంగ్రెస్‍లో చేరిన వారు తిరిగి బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ,
బీజేపీలో పాత కొత్త లీడర్లు అనే మాట ఉండదని కండువా కప్పుకున్న నాటి నుంచే వారు మా కుటుంబమన్నారు. కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటామని బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఇష్టపడి పనిచేసేవారినందరిని స్వాగతిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయిందని, ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు భారం అయిందన్నారు. వాళ్ల సొంత కుటుంబ సభ్యులకే ఆ పార్టీ భారంగా మారింది. అందుకే తలోదారిలో వెళ్తున్నారు. మిగిలింది తెలంగాణకోసం కొట్లాడేది బీజేపీ మాత్రమేనన్నారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను ఎందుకు బాయ్‍కాట్ చేశారో వారికైనా అర్థమైందా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఐదు రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నూటికి నూరు శాతం విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు మా సార్ లేస్తే ఎలా ఉంటుందో చూడాలన్నారు. కానీ సభ అయిపోయినా సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు అంటాం. అలాంటిది కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర శాసనసభలో మంచి చర్చ జరిపి ఈ పదేళ్లలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సిన పాలక పక్షం మీనమేషాలు లెక్కిస్తే, మేమే ప్రతిపక్షం అని చెప్పుకున్న వాళ్లు సభ నుంచి పారిపోయారని దుయ్యబట్టారు.

ఐదురోజుల సభలో కృష్ణా జలాలు, హిల్ట్ భూములపై ప్రధానంగా చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఎందుకు తోకముడుచుకు పారిపోయిందని రఘునందన్ రావు ప్రశ్నించారు. సభలో బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉన్నాం. ఉన్న ఎనిమిది మంది మా సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు గట్టిగా కొట్లాడారన్నారు. ఎంత మందిమి ఉన్నామన్నది కాదు పాలక పక్షాన్ని ఎలా నిలదీశామన్నదే ముఖ్యం అన్నారు. ఎంఐఎం అధికారంలో ఎవరుంటే వారికి తొత్తులుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలు అని ప్రజాసమస్యలపై పోరాడాల్సి వస్తే కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ప్రజా గొంతుకగా నిలబడ్డారని ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. భవిష్యత్ లో ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా మాకే అవకాశం ఇవ్వాలని కోరారు.

Latest