- కరీంనగర్ కు ‘‘ఆయుష్‘‘ మంజూరు
- పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసిన కేంద్రం
- ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి
- రూ.15 కోట్లతో 50 పడకల ఆసుపత్రికి కేంద్రం ఆమోదం
- రూ.7.5 కోట్ల నిధులు విడుదల
- ఆయుష్ సేవల్లో ఉత్తర తెలంగాణకు కీలకం కానున్న కరీంనగర్
హైదరాబాద్, మహా : ఉత్తర తెలంగాణ ప్రజలకు.ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. ఈ ప్రాంతానికి ఆయుష్ (ఆయుర్వేదం, యోగా నేచురోపతి, యునాని, సిద్ద, హోమియోపతి) ఆసుపత్రి రాబోతోంది. కరీంనగర్ లో 50 పడకల ‘ఆయుష్’ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అల్లోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలుండటంతో ఈ ప్రాంత ప్రజలు గత కొంత కాలంగా ఆయుర్వేదం, హోమియోపతి చికిత్సవైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో వీటికి ఆదరణ కూడా బాగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రతిపాదనలు పంపి ఉన్నతాధికారులతోపాటు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ను కలిసి కరీంనగర్ లో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు.
తెలంగాణలో వికారాబాద్, సిద్దిపేట, భూపాపల్లి జిల్లాల్లో ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రులున్నాయి. అయినప్పటికీ బండి సంజయ్ విజ్ఝప్తి మేరకు కరీంనగర్ లో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర ఆయుష్ విభాగం అధికారులు పరిశీలించి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుకు మొత్తం రూ.15 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అందులో భాగంగా రూ.7.5 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తక్షణమే ‘ఆయుష్’ ఏర్పాటు కోసం తగిన స్థలాన్ని ఎంపిక చేసి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. స్థల ఎంపిక ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుతోపాటు డాక్టర్లు, సిబ్బందిని నియామక బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆయుష్ అధికారులతో చర్చించారు. స్థల సేకరణపై ద్రుష్టి సారించారు. ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటైతే ఆయుర్వేద, హోమియోపతి, యోగా నేచురోపతి, యునాని, సిద్ద వైద్య చికిత్స సేవలన్నీ అందుబాటులోకి రానున్నాయి.








