Mahaa Daily Exclusive

  రైతులకు వంద శాతం నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి తుమ్మల..

Share

• సాగునీటి లక్ష్యంతో సీతారామ పనులపై ప్రత్యేక దృష్టి

• గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భరోసా

• రైతులకు వంద శాతం నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

• 1989లో అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపన

• 254 ఎకరాల్లో విస్తరించిన అగ్రికల్చర్ కాలేజ్

• 35 ఏళ్లలో 2500 మందికి పైగా అగ్రీ బీ.ఎస్సీ పట్టభద్రులు

• 30 మంది విద్యార్థులతో ప్రారంభమై ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌కు 450 మంది

 

అశ్వారావుపేట, జనవరి 9, మహా : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన రైతు మేళా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పాల్గొని రైతులకు ప్రభుత్వ వ్యవసాయ విధానాలు, పథకాలను వివరించారు. 35 సంవత్సరాల క్రితం మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలనే దూరదృష్టితో నాటి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేసిన ప్రతిపాదనకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆమోదం తెలపడంతో 1989లో అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్ ప్రారంభమైంది. ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, ఉద్యాన పంటలకు అనుకూల వాతావరణం ఉండటంతో విద్యార్థులకు ప్రాయోగిక శిక్షణ అందించేందుకు అశ్వారావుపేట అనువైన ప్రాంతంగా రూపుదిద్దుకుంది. 254 ఎకరాల్లో ఏర్పాటైన ఈ కళాశాల తరగతి గదితో పాటు పొలాల్లో కూడా విద్యనందించే విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రారంభంలో కేవలం 30 మంది విద్యార్థులతో అగ్రీ బీ.ఎస్సీ కోర్సు ప్రారంభమై, ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌కు 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాలుగు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు ప్రస్తుతం కళాశాలలో ఉన్నారు. 18 మంది శాశ్వత అధ్యాపకులు, 6 మంది ఒప్పంద అధ్యాపకులు విద్యాబోధన అందిస్తున్నారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడి నుంచి అగ్రీ బీ.ఎస్సీ పూర్తి చేశారు. వ్యవసాయ విద్య ద్వారా వేలాది రైతు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజ్, మంత్రి తుమ్మల నాగేశ్వరావు దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. కళాశాల వల్ల అశ్వారావుపేట ఖ్యాతి రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ విస్తరిస్తోందని రైతులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

 

హార్టికల్చర్ హబ్‌గా అశ్వారావుపేట :

 

అశ్వారావుపేట ప్రాంతం ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, వక్క, అరటి, బొప్పాయి, జామ, పూల తోటల సాగుకు కేంద్రంగా మారింది. చుట్టుపక్కల ఉన్న ఉద్యాన తోటలు విద్యార్థులకు ప్రత్యక్ష క్షేత్ర అధ్యయనానికి ఉపయోగపడుతున్నాయి. తరగతిలో నేర్చుకున్న పాఠాలను పొలాల్లో అమలు చేసే అవకాశం ఈ ప్రాంతంలో ఉందని విద్యార్థులు చెబుతున్నారు.

 

వ్యవసాయ విద్యకు పునాది వేసిన తుమ్మల దూరదృష్టి :

 

రైతుబిడ్డగా వ్యవసాయంపై ప్రత్యేక మమకారం కలిగిన తుమ్మల నాగేశ్వరావు, పంటలకు కూడా వైద్యులు అవసరమనే భావనతో వ్యవసాయ విద్య ప్రాధాన్యతను అప్పుడే గుర్తించారు. ఆధునిక సాగు పద్ధతులు, మేలు రకాలు, చీడపీడల నియంత్రణ, అధిక దిగుబడుల కోసం వ్యవసాయ పట్టభద్రులు అవసరమని నమ్మి కళాశాల ఏర్పాటుకు పట్టుదలతో కృషి చేశారు. ఎన్టీఆర్ పాలనలో ప్రారంభమైన ఈ కళాశాల అభివృద్ధి ప్రయాణం, తరువాత చంద్రబాబు పాలనలో, కేసీఆర్ పాలనలో కొనసాగి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోంది.

 

రైతు మేళాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు :

 

రైతులను సాంకేతిక పరిజ్ఞానం వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ రైతు మేళా నిర్వహించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ దేశంలోనే వరి సాగులో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. వరి పండించిన రైతులకు మద్దతు ధరను 48 గంటల్లో ఖాతాల్లో జమ చేయడంతో పాటు బోనస్ కూడా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందించి వంద శాతం నీటిని రైతులకు అందిస్తామని హామీ ఇచ్చారు.

 

మంత్రి తుమ్మల నాగేశ్వరావు వ్యాఖ్యలు :

 

సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకే ఇరిగేషన్ శాఖ మంత్రిని అశ్వారావుపేటకు ఆహ్వానించామని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యమని అన్నారు. అశ్వారావుపేట రైతులు దేశంలోనే అరుదైన విధంగా అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారని, రైతులు పచ్చగా ఉంటేనే ప్రభుత్వాలు పచ్చగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయం, ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలో ముందుండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

 

జారే ఆదినారాయణ వ్యాఖ్యలు :

 

అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ, వ్యవసాయ కళాశాల వల్ల ఈ ప్రాంతానికి విద్యా, ఆర్థిక అభివృద్ధి కలిగిందని తెలిపారు. రైతులు, విద్యార్థులు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే కేంద్రంగా ఈ కళాశాల మారిందన్నారు. వ్యవసాయ పరిశోధనలు, శిక్షణ మరింత విస్తరించేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అశ్వారావుపేటను వ్యవసాయ విద్యకు మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి దయానంద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్, పోలీస్ కమిషనర్ రోహిత్ రాజ్, ఉన్నత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest