- సంక్రాంతి పండుగకు
- పల్లె దారి పట్టిన పట్నం
- హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్
- కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్, మహా : సంక్రాంతి పండగ వేళ పట్నం మొత్తం పల్లె దారి పట్టింది. హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనాలు వేగంగా ముందుకు సాగేలా అధికారులు అదనపు టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు.
శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు సుమారు 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఈ రద్దీ అధివారం ఉదయం నుంచి మరింత పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా టోల్ వద్ద తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. కానీ వాహనాలు ఒకేసారి వేల సంఖ్యలో వస్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు చిక్కులు తప్పడం లేదు. హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వేగంగా ఫాస్టాగ్ స్కానింగ్
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా సాంకేతిక ఏర్పాట్లు చేయడంతో పాటు, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద అత్యవసర సేవల కోసం అంబులెన్స్, క్రేన్, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఏపీలోని నందిగామ వై-జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
నల్గొండ, ఖమ్మంలలో రద్దీ..
సంక్రాంతి సంబరాల వేళ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ సొంతూళ్లకు చేరుకోవడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే జనం సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రధాన బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ఖమ్మంతో పాటు ఇతర జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూస్తోంది.
శనివారం నుండి సెలవులు కావడంతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పండుగకు ముందే సిద్ధమయ్యారు. రెండు రోజులుగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా కనిపిస్తుంది. హైదరాబాద్‌లో జాబ్ చేసే వారితో పాటు స్థిరపడిన ఏపీ వారంతా తమ స్వగ్రామాలకు పయనమవుతున్నారు. రైళ్లు, బస్సులతో పాటు సొంత వాహనాల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో సొంతూళ్లకు ఎక్కువ మంది వెళ్తుండటంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూకడుతున్నాయి. గడచిన మూడు రోజులుగా హైదరాబాద్ నుంచి ఏపీతో పాటు తెలంగాణలోని గ్రామాలకు దాదాపు 30 లక్షల మంది పండగ కోసం వెళ్ళారని తెలుస్తోంది.
బస్టాండ్ల వద్ద భారీ రద్దీ..
భాగ్యనగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రధాన కేంద్రాలైన దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికుల తాకిడి విపరీతంగా పెరిగింది. బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయినప్పటికీ.. సమయానికి బస్సులు రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరడంతో బస్టాండ్లన్నీ రద్దీగా మారాయి. టిక్కెట్లు దొరక్క, బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చిన వారైతే.. మరిన్ని తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రైళ్లు, బస్సుల్లో ‘నో వేకెన్సీ’..
ప్రయాణికుల డిమాండ్ భారీగా పెరగడంతో బస్సులు, రైళ్లలో అన్ని రిజర్వేషన్లు పూర్తిగా ఫుల్ అయ్యాయి. ఆన్‌లైన్, కౌంటర్ రిజర్వేషన్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్యకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. సమయానికి బస్సులు రాకపోవడం ప్రయాణికుల సమస్యలను మరింత పెంచుతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడవకపోవడంతో బస్టాండ్లలో గందరగోళం నెలకొంది. కొన్నిచోట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించారు.
అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి..
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రద్దీని నియంత్రించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ..
రిజర్వేషన్లు దొరక్కపోవడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని.. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వాహనాల్లో సీట్లు దొరకని ప్రయాణికులు చేసేదేమీ లేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు.. సాధారణ చార్జీల కంటే మూడు రెట్లు అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టినప్పటికీ అవి నామమాత్రంగానే ఉన్నాయి. టికెట్ పై ఒక ధర వేస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు, వసూళ్ళు మాత్రం రెట్టింపు చేస్తున్నారు.
ట్రాఫిక్‌తో నరకం..
హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ వైపు వెళ్లే రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







