Mahaa Daily Exclusive

  ఆస్తులు కాదు.. మంచితనం, సేవనే వారసత్వంగా ఇవ్వాలి: స్వర్ణభారత్ ట్రస్ట్ సంక్రాంతి సంబరాల్లో వెంకయ్య నాయుడు

Share

  • సేవామార్గమే అసలైన వారసత్వం
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • సంక్రాంతి అచ్చంగా రైతుల పండుగ, నలుగురి సంక్షేమాన్ని కోరే పండుగ
  • ప్రకృతి – సంస్కృతి – మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలి
  • హైదరాబాద్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్, మహా : సేవా మార్గమే తాను విశ్వసించే అసలైన వారసత్వమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని, తమ కుటుంబ సభ్యులు ఈ మార్గంలో ముందుకు సాగడం అత్యంత సంతృప్తిని అందించిందన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్, ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్)లో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముప్పవరపు ఫౌండేషన్ భవనాన్ని ప్రారంభించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు, ప్రముఖ సినీనటులు బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమ అనంతరం ట్రస్ట్ ప్రాంగణంలోని సర్దార్ పటేల్ ప్రజామందిరంలో ఆహూతులను ఉద్దేశించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని తాను ఇష్టపడనని చెప్పారు. క్యారక్టర్ (గుణం), కెపాసిటీ(సామర్థ్యం), క్యాలిబర్(యోగ్యత), కాండక్ట్(నడత) అనే అర్హతలు ఉన్న ఎవరైనా రాజకీయాల్లో రాణించవచ్చని, అయితే సేవను వారసత్వంగా తీసుకోవడం మంచి విషయమని తాను విశ్వసిస్తానని చెప్పారు. సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలన్న సంకల్పంతో 25 సంవత్సరాల క్రితం తాను ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్ట్ ను తన కుమార్తె దీపావెంకట్ విజయవంతంగా నడిపిస్తున్నారని, ఇప్పటి వరకు లక్షమందికి నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో ఉచితంగా ట్రస్ట్ ద్వారా శిక్షణ అందించారని, ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. తన కుమారుడు ముప్పవరపు హర్షవర్దన్ ముప్పవరపు ఫౌండేషన్ ద్వారా సేవామార్గంలో పయనించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. అందులో వారికి ఆనందం లభిస్తుంది. అయితే ఆస్తులు మాత్రమే కాదు మంచితనాన్ని, మానవత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతను కూడా వారసత్వంగా అందించాలి. అప్పుడు మహదానందం లభిస్తుంది. పురాతన భారతీయ ధర్మమైన షేర్ అండ్ కేర్ సూత్రాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనకున్న దానిని నలుగురితో పంచుకోవడం, నలుగురి సంక్షేమం పట్ల శ్రద్ధ వహించడం మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు.

సంక్రాంతి పండగ తెలుగు వారి సంస్కృతికి ప్రతీక అని, ఇది ప్రకృతిని గౌరవించే గొప్ప పండగ అని వెంకయ్యనాయుడు చెప్పారు. పండగ అంటే కొత్తబట్టలు, కొత్త ఆలోచనలే గాక పాత అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుని, భవిష్యత్తును నిర్ణయించుకుని ముందుకు సాగడం అని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళలు, మన ఆచార వ్యవహారాలు, మన ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే అసలైన ఆనందం వస్తుందన్నారు. ‘‘ఆ రోజుల్లో వ్యవసాయమే మనకు ఆధారంగా ఉండేది. దాని ద్వారా వచ్చే ఫలసాయం మన అవసరాలకు ఉంచుకోవడమే కాకుండా, మనతో పని చేసిన శ్రామికులకు, అన్ని వృత్తుల వారికి పంచి ఇచ్చి, ఆనందాన్ని పంచే పండుగ సంక్రాంతి. వ్యవసాయంలో రైతులకు సాయంగా శ్రమించే పశువులను కూడా పూజించే సందర్భం ఈ పండగ. కనుమ నాడు పశువులను అలంకరించి పూజించడం మన సంప్రదాయం.’’ అని నాయుడు గుర్తు చేశారు.

పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలని, కుటుంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. ప్రకృతిలోని ప్రతి జీవితో మన ఆనందాన్ని పంచుకోవాలన్నారు. ‘‘ప్రకృతిని ప్రేమించాలి – ప్రకృతితో కలిసి జీవించాలి, ప్రకృతి, సంస్కృతులు మేలైన భవిష్యత్తును నిర్మిస్తాయి’’ అని స్పష్టం చేస్తూ భారతీయ సంస్కృతి పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని, ఈ సంక్రాంతి నుంచే అందరూ ఈ సంకల్పాన్ని తీసుకోవాలని సూచించారు. తెలుగు వారి ప్రత్యేకమయిన ఇటువంటి సంస్కృతులను పరిరక్షించుకోవాలంటే తెలుగువారందరూ తప్పనిసరిగా తెలుగులో మాట్లాడుకోవాలన్నారు. మాతృభాషను కాపాడుకునేందుకు ఐదు అంశాల మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ‘‘వీటిలో మొదటిది ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం. రెండోది పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం. మూడోది న్యాయస్థానాల కార్యకలాపాలు సైతం మాతృభాషలోనే సాగాలి. తీర్పులు కూడా అందులోనే ఇవ్వాలి. ఇక నాలుగోది ఉన్నత మరియు సాంకేతిక విద్యలో… స్వదేశీ భాషల వినియోగం క్రమంగా పెరగాలి. అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే… ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో, తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’’ అని సూచించారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పాలన వ్యవహారాలను తెలుగులోనే కొనసాగించాలని సూచించారు. అలాగే రాష్ట్రాలు వేరైనా మన మూలం తెలుగేనని, ఏమైనా సమస్యలుంటే కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఆకాంక్షను రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు వ్యక్తం చేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందుతుందని, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు అంతా కలిసే అమరావతి అని అన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ స్వరకల్పన చేసి ఆలపించిన వేమన పద్యాల సీడీని వెంకయ్యనాయడు ఆవిష్కరించారు. అంతకు ముందు 6 దశాబ్దాలుగా కోటిన్నర చెట్లను నాటి తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితం చేసిన వనజీవి రామయ్య జీవిత కథను చలనచిత్రంగా తీసుకువస్తున్న నేపథ్యంలో సినిమాలోని ఓ దృశ్యం లో భాగంగా, స్వర్ణభారత్ ట్రస్టులో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో వెంకయ్యనాయుడుగారి సతీమణి ఉషమ్మ, వారి కుమార్తె దీపావెంకట్, కుమారుడు హర్షవర్దన్, స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Latest