Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి ఇళ్లు కట్టే వ్యక్తి కాదు.. కూలగొట్టే వ్యక్తి: సీఎం పాలనపై కేటీఆర్ ఘాటు విమర్శలు

Share

  • సీఎం పాలనపై దృష్టి పెట్టాలి
  • ఇళ్ళ కట్టట్లేదు.. కూల్చుతున్నారు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో రూ.3.5లక్షల కోట్లు అప్పు ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన సోదాహరణగా వివరించారు. ఈ అప్పుల విషయంలో తమపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ హామీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ నిన్నమొన్నటి వరకు ప్రశ్నిస్తే.. సీఎం రేవంత్ రెడ్డి నవ్వేవారని.. ఇక్కడ లంకెబిందెలు ఉంటాయని తాను వచ్చానని.. కానీ అవి ఇక్కడ లేవని రేవంత్ చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ పరిధిలో ఒక్క ఇందిరమ్మ ఇల్లూ ఆయన కట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదని కూలగొట్టే వ్యక్తి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గరీబ్ వాళ్ల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూలగొడతారంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలపై ఈ సందర్భంగా కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్‌లో ప్రకాష్‌గౌడ్ ఉంటే.. పార్టీ కార్యక్రమానికి ఎందుకు రాలేదంటూ సందేహం వ్యక్తం చేశారు. పందిలాగా వందేళ్లు బతకొద్దు.. నంది లెక్క నాలుగేళ్లు బతికినా చాలు అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్లలో చేసిన మోసం చాలని.. పాలనపై దృష్టి పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ ఈ సందర్భంగా హితవు పలికారు.

Latest