Mahaa Daily Exclusive

  జాతీయ కబడ్డీ పోటీల్లో ‘వయస్సు’ సెగ: చివరి రోజు రణరంగంగా మారిన మైదానం!

Share

చివరి రోజు గందరగోళం

★69వ జాతీయ అండర్–17 కబడ్డీ పోటీల్లో అనర్హుల వివాదం

★పలు మార్లు కబడ్డీ పోటీలకు అంతరాయం

★ డిఎస్పీ రంగ ప్రవేశం… సద్దుమణిగిన ఆందోళనలు

పినపాక,మహా:69వ జాతీయ అండర్–17 కబడ్డీ పోటీల్లోఆదివారం గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ జట్టుపై యూపీ జట్టు గెలుపొందడంతో ప్రారంభమైన వివాదం ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. ఉత్తరప్రదేశ్ టీమ్ నిబంధనలకు విరుద్ధంగా అధిక వయసు గల యువకులతో కబడ్డీ ఆట ఆడించిందని తెలంగాణ టీమ్ కు సంబంధించిన అధికారులు ఎన్‌టీఎఫ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తర ప్రదేశ్ టీమ్ లో అనర్హులను గుర్తించి వారిని తదుపరి గేమ్ ఆడకుండా నిషేధించారు.

కర్ణాటక టీం ఆందోళన

హర్యానా జట్టు నిబంధనలకు విరుద్ధంగా అధిక వయస్సు వారితో తమతో కబడ్డీ ఆడించారని కర్ణాటక టీం ఆదివారం సాయంత్రం నిరసనకు దిగింది. హర్యాన రాజస్థాన్ టీమ్ ల మధ్య సెమీఫైనల్ పోరు ప్రారంభానికి ముందు కర్ణాటక కబడ్డీ టీం సభ్యులు ఆందోళన చేపట్టారు. అనర్హులచే కబడ్డీ ఆడిపించడంతో తమ టీం ఓటమిపాలైందని కర్ణాటక టీం ప్రధాన ఆరోపణ. అధికారులు పలుమార్లు సర్ది చెప్పినప్పటికిని కర్ణాటక టీం వారు ఆందోళనకి దిగారు. దీనితో మణుగూరు డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి రంగ ప్రవేశం చేసి తమదైన శైలిలో హెచ్చరించారు. దీనితో వారు నిరుత్సాహంతో ఏడూళ్ళ బయ్యారం క్రీడా ప్రాంగణాన్ని విడిచి బయటకు వెళ్లారు.

మధ్యలోనే గ్రౌండ్ విడిచి వెళ్లిపోయిన హర్యానా టీం

మూడవ స్థానం కోసం తెలంగాణ హర్యానా రాష్ట్ర జట్లు పోటీ పడగా ఆట ప్రారంభమైన పది నిమిషాలకే హర్యాన జట్టు గ్రౌండ్ విడిచి బయటికి వెళ్లింది. హర్యానా టీం లో సైతం నిబంధనలకు విరుద్ధంగా క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనితో వారు చేసేదేం లేక మధ్యలోనే గ్రౌండ్ ని విడిచి బయటకు వెళ్లారు. దీనితో తెలంగాణ జట్టు మూడవ స్థానం సరిపెట్టుకుంది.

తప్పుడు ధృవీకరణ పత్రాలు… అధిక వయస్సు

పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో పినపాక మండలంలో నిర్వహిస్తున్న 69వ జాతీయ స్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే ఆదివారం జరగాల్సిన కీలక మ్యాచ్‌ల సందర్భంగా అనర్హులు, అధిక వయస్సున్న క్రీడాకారులను ఆడించారన్న ఆరోపణలతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
ప్రీ–క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కర్నాటక – రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉండగా, కర్నాటక జట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలతో పాటు అధిక వయస్సు గల క్రీడాకారులను ఆడించిందన్న అభియోగాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కర్నాటక జట్టును పోటీ నుంచి తప్పించి, రాజస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో రాజస్థాన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
సెమీఫైనల్‌లో రాజస్థాన్ – హర్యానా జట్లు తలపడగా, మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు సమానంగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో నిర్వాహకులు సూపర్ రైడ్‌కు అవకాశం కల్పించారు. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ రైడ్‌లో రాజస్థాన్ పైచేయి సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
ఇదే సమయంలో మధ్యాహ్నం జరిగిన మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్ – తెలంగాణ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కూడా పలు జట్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనర్హులను ఆడించడం, ఒకరి స్థానంలో మరొకరిని మైదానంలోకి దింపినట్లు ఆరోపణలు రావడంతో, ఎన్‌టీఎఫ్ (నేషనల్ టెక్నికల్ ఫోరం) అధికారులు రంగంలోకి దిగారు. బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా అనర్హులను గుర్తించి తొలగించారు. కేంద్ర స్థాయి అధికారుల జోక్యంతో వివాదం సద్దుమణిగి, ఉత్తర ప్రదేశ్ జట్టును ఫైనల్‌కు అర్హంగా ప్రకటించారు.
ఈ పరిణామాలతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, నిర్వాహకులు తక్షణ చర్యలు తీసుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది.