Mahaa Daily Exclusive

  దమ్మపేటలో ‘వెలుగు’ల శోభ.. మేడారంలో శాశ్వత కట్టడాలు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Share

  • సంక్రాంతి వేళ…వెలుగుతో శోభ
  • – అభివృద్ధి, సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయం.
  • – పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 శాతం పట్టం కట్టారు.యంపిటీసీ లలో అదే జోరు చూపించండి.
  • – సెంట్రల్‌ లైటింగ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి

దమ్మపేట,మహా : ప్రజా పాలనలో సంక్రాంతి సంబరాల వేళ మండల కేంద్రంలో వెలుగుతో శోభను సంతరించుకో బోతుందని రెవిన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రజల నమ్మకమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలైన బలం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న వేళ,అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలుస్తున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. మండల కేంద్రం దమ్మపేటలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ డివైడర్‌, సెంట్రల్ లైటింగ్ ను ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకంతోనే రాష్ట్రవ్యాప్తంగా 69 నుంచి 70 శాతం మేర కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని మంత్రి గుర్తుచేశారు.దమ్మపేటలోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు,రానున్న ఎంపిటిసి ,మున్సిపల్ ఎన్నికల్లో ఇదే ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు.

మేడారంలో 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని కట్టడాలు

ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ ఏర్పాట్లు చేస్తోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. భవిష్యత్ తరాల కోసం, కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాల తరహాలో, సుమారు 200 ఏళ్ల వరకు చెక్కుచెదరని విధంగా నూతన నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం రానున్నారని, 19న అక్కడ పూర్తయిన అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభిస్తారని వివరించారు, మేడారం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాశ్వత కట్టడాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ బాబు,సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest