Mahaa Daily Exclusive

  మృత్యుపాశంగా చైనా మాంజా: ఏఎస్‌ఐ గొంతుకు చుట్టుకున్న దారం.. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి!

Share

  • పోలీసు మెడకు చైనా మాంజా ఉచ్చు
  • డ్యూటీకి వెళ్తుండగా ఏఎస్‌ఐకి తీవ్ర గాయాలు
  • మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజా

హైదరాబాద్, మహా : నగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాపాయాన్ని సృష్టించింది. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగరేసేందుకు వాడే ఈ ప్రమాదకరమైన దారం విధి నిర్వహణకు వెళ్తున్న ఒక పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న నాగరాజు చైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ బందోబస్తు విధుల్లో ఉన్నారు. సోమవారం సాయంత్రం సుమారు 4.20 గంటల సమయంలో ఆయన ఉప్పల్‌లోని తన నివాసం నుండి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్దకు చేరుకోగానే.. గాలిలో వేలాడుతున్న చైనా మాంజా ఆయన గొంతుకు చుట్టుకుంది. వాహనం వేగంగా ఉండటంతో మాంజా గొంతులోకి బలంగా చొచ్చుకెళ్లింది. దీంతో ఆయన గొంతుకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, తోటి పోలీసులు ఆయనను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

పర్యావరణానికి, పక్షులకు, మానవ ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజాపై ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. చైనా మాంజా విక్రయిస్తే కేసులు బుక్ చేసి జైలుకు పంపుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సహా ఇతర పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా మంజా అమ్మే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా పోలీసు టీంలు ఏర్పాటు చేశామని.. వారి వివరాలు తెలపాలని ప్రజల్ని సైతం కోరారు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారు. పండుగ సీజన్‌లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టాలని, మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు మెడకు స్కార్ఫ్ లేదా రక్షణ కవచాలను ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Latest