హైదరాబాద్, మహా : ఈ నెల 18 న తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ఈసారి మంత్రివర్గ బేటీ ములుగు జిల్లా మోడారంలో జరుగనుంది. సాధారణంగా సచివాలయానికే పరిమితమయ్యే క్యాబినెట్ భేటీని, ఈసారి సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర నేపథ్యంలో అక్కడే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 18న ఉదయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, సీపీఐ వంద సంవత్సరాల వేడుకకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంతో కలిసి మేడారం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత మేడారంలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మరుసటి రోజు (19న) ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించి, దర్శనం చేసుకున్న అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమై, అదే రోజు రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు బయలుదేరుతారు.
కేబినెట్ లో చర్చించే అంశాలివే
ఈ మేడారం క్యాబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా త్వరలో రానున్న పురపాలక ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్లపై చర్చించనున్నారు. అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రైతుభరోసా నిధుల విడుదల, హ్యామ్ మోడల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పథకాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
మేడారం ప్రాముఖ్యత
మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క సారక్క మహాజాతర కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గత కొన్ని నెలల నుంచి మేడారం ఆలయం, జాతర అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. మంత్రి సీతక్క పనులను సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం మేడారం జాతరకు సంబంధించి, సమ్మక్క సారక్క గద్దెల ఆధునికీకరణకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా తెలంగన మంత్రివర్గ సమావేశం మేడారంలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.







