Mahaa Daily Exclusive

  అప్పు తీర్చడం ఇష్టం లేకే హత్య: ఆదిలాబాద్ మహిళ మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

Share

  • అప్పు తిరిగిచ్చే ఇష్టం లేక హ‌త్య‌
  • మిస్సింగ్ కేసు మ‌హిళ హ‌త్యకు గుర‌యినట్టు తేల్చిన పోలీసులు
  • మావ‌ల పోలీస్ స్టేష‌న్ లో వివరాలు వెల్ల‌డించిన ఎస్పీ

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసును ఛేదించిన‌ట్టు, అది హత్య కేసుగా న‌మోదు చేసి కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం మావ‌ల పోలీస్ స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న వివ‌రాల‌ను వెల్లడించారు. గ‌త నవంబర్ 29న హ‌తురాలు పిట్టల వాడకు చెందిన ఇమ్రానా జబీన్ నవంబర్ 26 నుంచి కనిపించడం లేదని తన సోదరి సమీనా యాస్మీన్ ఫిర్యాదు మేరకు మావల పోలీస్ స్టేష‌న్ లో కేసు నమోదు చేశారు. విచారణలో ఇమ్రానా జబీన్‌కు ఇంద్రవెల్లికి చెందిన ఫారూఖ్ ఖాన్ తో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ఉన్నట్లు గుర్తించారు. సీఐ కె. స్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టి, సాంకేతిక ఆధారాలతో ఈనెల 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఫారూక్ ఖాన్ అతని డ్రైవర్ బస్సీ రమేష్ లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. విచారణలో నిందితులు హత్యకు పాల్పడ్డట్లు ఒప్పుకున్నార‌ని తెలిపారు.
హ‌తురాలుకు ఫారూఖ్ సుమారు రూ.8 ల‌క్ష‌ల 80వేల‌ నగదుతో పాటు,8.5 తులాల బంగారం బాకీ ఉండగా, తన సొంత అవసరాల నిమిత్తం ఆమె డబ్బులు తిరిగి అడగడంతో తిరిగి ఇచ్చేందుకు ఇష్టపడని నిందితుడు హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు. గ‌త‌ నవంబర్ 26న పిట్టలవాడలోని ఆమె నివాసంలోనే త‌న డ్రైవ‌ర్ ర‌మేష్ స‌హాయంతో జ‌బీన్ ను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సర్కాని ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, కల్వర్ట్ సమీపంలో గుంతలో పూడ్చినట్లు వెల్లడించారు. నిందితుల సమాచారంతో రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో తహసీల్దార్ సమక్షంలో మృత‌దేహాన్ని వెలికి తీసారు. శరీరం కుళ్లిపోయినప్పటికీ, మృతురాలి దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించడంతో డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించారు. ఇద్దరు నిందితులను న్యాయస్థానానికి హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన‌ట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావల సీఐ కర్రె స్వామి, ఎస్సైలు మధుకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest