- పండగ వేళ…
- 5 రోజుల్లో 3 లక్షలకు పైగా వాహనాల రాకపోకలు
- విజయవాడ నేషనల్ హైవే రికార్డ్
హైదరాబాద్, మహా : తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అయింది. ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి గత ఐదు రోజులుగా కిటకిటలాడింది. పండుగ రద్దీ కారణంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అసాధారణ రీతిలో పెరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద నమోదైన గణాంకాల ప్రకారం, కేవలం 5 రోజుల వ్యవధిలోనే రెండు వైపులా కలిపి మొత్తం 3.04 లక్షల వాహనాలు ప్రయాణించడం ఒక రికార్డుగా నిలిచింది. ఇందులో సుమారు 2.04 లక్షల వాహనాలు కేవలం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లినవే కావడం గమనార్హం.
శనివారం ఒక్కరోజే 71 వేలకు పైగా వాహనాలు
టోల్ ప్లాజా లెక్కల ప్రకారం, శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు ప్రయాణించాయి. అలాగే శుక్రవారం 53 వేలు, ఆదివారం 62 వేలు, సోమవారం 56 వేలు, మరియు మంగళవారం 62 వేల వాహనాలు పంతంగి టోల్ ప్లాజాను దాటాయి. బుధవారం భోగి పండుగ కావడంతో రద్దీ కొంత సాధారణ స్థితికి చేరుకుంది. గత ఏడాది మూడు రోజుల ముందు వరకు 2.07 లక్షల వాహనాలు మాత్రమే ప్రయాణించగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 3 లక్షలు దాటడం ఈ ఏడాది పండుగ రద్దీ తీవ్రతను సూచిస్తోంది.
ఓవైపు అభివృద్ధి పనులు, మరోవైపు పండుగ ట్రాఫిక్ జామ్
ప్రయాణికుల రద్దీ భారీగా ఉన్నప్పటికీ, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఫాస్టాగ్ స్కానింగ్‌ను వేగవంతం చేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఉన్నా, త్వరగా సమస్య పరిష్కారమై ప్రయాణాలు సాఫీగా సాగాయి. దీనికి తోడు జాతీయ రహదారిపై జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా, చాలామంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి దోహదపడింది. గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాలకు వెళ్లేవారు సాగర్ హైవే వైపు, ఖమ్మం వైపు వెళ్లేవారు భువనగిరి-చిట్యాల మార్గంలో ప్రయాణించడంతో ప్రధాన రహదారిపై ఒత్తిడి కొంతమేర తగ్గినట్లు అధికారులు తెలిపారు.








