Mahaa Daily Exclusive

  దంపతుల ‘హనీ ట్రాప్’ గుట్టురట్టు: వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షల వసూళ్లు

Share

  • దంపతుల వలపు వల
  • పర్సనల్ వీడియోలతో వసూళ్ల దందా
  • బట్ట బయలు చేసిన కరీంనగర్ పోలీసులు

కరీంనగర్, మహా : అప్పులు తీర్చుకోవడానికి ఓ జంట అడ్డదారి తొక్కింది. ఏకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ‘హనీ ట్రాప్’ (వలపు వల) పేరుతో చాలా మందిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టారు. భారీ సంఖ్యలో డబ్బులు వసూలు చేశారు. వీరి వలలో చిక్కిపోయిన పలువురు బయటికి రాలేకపోయారు. అయితే ఎట్టకేలకు ఓ వ్యాపారి పోలీసులను ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

ఆకర్షించేలా పోస్టులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కరీంనగర్ రూరల్ మండలం ఆరేపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆకర్షించేలా వ్యక్తిగత ఫోటోలను పోస్ట్ చేస్తారు. వాటిని చూసి కొంతమంది ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. మరి కొందరు ఆమె నెంబర్ తీసుకొని సంప్రదించారు. ఇదే అదనుగా భావించిన దంపతులు సదరు వ్యక్తులను హానీ ట్రాప్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలా వంద మంది వరకు ఆమెతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇందులో బడా వ్యాపారస్తులున్నారని సమాచారం. సదరు మహిళతో ప్రైవేట్ గా గడిపిన సమయంలో భర్త వీడియోలు తీసేవాడు. మరోవైపు ఇంటికి వచ్చే వారి నుంచి వసూలు చేసే డబ్బులతో లగ్జరీ లైఫ్ ను గడపటం మొదలుపెట్టారు. సీన్ కట్ చేస్తే సదరు భార్య భర్తలు మరో దారుణానికి తెగబడ్డారు. రహస్యంగా తీసిన వీడియోలతో సదరు వ్యక్తులకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని. డబ్బులు ఇవ్వకపోతే వైరల్ చేస్తామని బెదిరించేవారు. ఇలా డబ్బులు దండుకునే పనిలో పడ్డారు.

ఏడాది కిందట వీరి వలలో చిక్కిన ఓ స్థానిక వ్యాపారి నుంచి ఈ దంపతులు ఏకంగా రూ. 14 లక్షలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా మరో రూ. 5 లక్షలు కావాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు భయపడి మరో రూ. లక్ష ఇచ్చినా వేధింపులు తగ్గకపోవడంతో చివరకు ధైర్యం చేసి కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వీరి అసలు బాగోతంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాలతో సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ దాబా వద్ద ఆగి ఉన్న భార్య భర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అసలు విషయాలను బయటపెట్టారు. కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించటం జరిగింది. నిందితులది మంచిర్యాల జిల్లాగా గుర్తించారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. గత కొంతకాలంగా కరీంనగర్ లో ఉంటూ ఈ వ్యవహారం నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

Latest