ములుగు, మహా : మేడారానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మేడారం వైపు వెళ్ళే రహదారులన్నీ రద్దీగా మారాయి. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. జాగారం నుంచి మేడారం వరకు వాహనాల రద్దీ ఉండగా కన్నెపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ రద్దీ నెలకొంది.
గట్టమ్మ ఆలయం వద్ద రద్దీ
మేడారంలో ఒక్కసారిగా రద్దీ పెరగటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొలాల్లో పార్కింగ్ కోసం వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇక ములుగు గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు మేడారంలో అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నారు. ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది. జాతర సంబంధిత సమాచారం కోసం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ మరియు క్యూఆర్ కోడ్తో పాటు ప్రత్యేక లోగో మరియు వీడియోలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ జాతర కోసం 21 విభాగాలకు చెందిన 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బందితో పాటు 2,000 మంది గిరిజన యువ వాలంటీర్లను నియమించారు. ఈ జాతర కోసం ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
గురువారం మంత్రుల ఆకస్మిక తనిఖీ
మేడారంలో జరుగుతున్న పనులను మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను వాహనంలో పరిశీలించి, శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దేల పునరుద్ధరణ పనులను పరిశీలించి, వన దేవతలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణం లోని ల్యాండ్ స్కేపింగ్ పనులను, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులను పరిశీలించి స్వయంగా ఫ్లోరింగ్ కింది భాగంలో ఇసుక ఎంత మేరకు నింపుతున్నారో పరిశీలించారు. పి టి భీమ్స్ పై అమర్చుతున్న బ్రాకెట్ లను, మీడియా టవర్స్ నిర్మాణాలను, క్యూ లైన్స్ షేడ్స్ లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కల్చరల్ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని, అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలని అన్నారు. పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారిని ఐనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జాతర పరిసరాలను జోనల్, యూనిట్ విధంగా విభజించి జోనల్ కు ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యతలను అప్పజెప్పాలని ఆలయ ప్రాంగణా పరిసరాలలో మిగిలిన వ్యర్ధాలను వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. డివైడర్ పనులు పూర్తయ్యాక వెంటనే ఫైర్ ఇంజిన్లతో అన్ని రహదారులపై క్లీనింగ్ నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.








