Mahaa Daily Exclusive

  మహారాష్ట్ర పురపోరులో మజ్లిస్ ప్రభంజనం: 29 కార్పొరేషన్లలో 95 స్థానాలు కైవసం

Share

  • మహారాష్ట్రలో ప్రధాన శక్తిగా మారుతున్న మజ్లిస్
  • మున్సిపల్ ఎన్నికల్లో భారీగా సీట్లు, ఓట్లు
  • కాంగ్రెస్‌కు గండమే

ముంబై, మహా : మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఎంఐఎం, తాజా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లలో ఎంఐఎం తన ప్రభావాన్ని చాటుతూ ఏకంగా 95 స్థానాలను కైవసం చేసుకుంది. ముస్లిం సామాజికవర్గం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆ పార్టీ సాధించిన ఈ విజయాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు కార్పొరేషన్లలో రెండో స్థానం

ఎంఐఎం విజయ పరంపరలో ఛత్రపతి శంభాజీనగర్, మలేగావ్ అత్యంత కీలకంగా మారాయి. శంభాజీనగర్‌లో ఏకంగా 24 స్థానాలు గెలుచుకుని ఆ నగర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక మలేగావ్‌లో 20 మంది అభ్యర్థులు విజయం సాధించి మున్సిపల్ ఫలితాల్లో తమ ముద్ర వేశారు. బృహణ్ ముంబైలో సైతం 8 స్థానాల్లో జెండా ఎగురవేసి, బీఎంసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో తన గళాన్ని వినిపించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు సోలాపూర్, ధూలే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో 8 సీట్ల చొప్పున సాధించి ఆయా ప్రాంతాల్లో బలమైన పట్టును నిరూపించుకుంది.

ముస్లింలు ఉన్న చోట్లల్లా మజ్లిస్ ఉనికి

కేవలం మరాఠ్వాడా ప్రాంతానికే పరిమితం కాకుండా విదర్భ , థానే బెల్ట్‌లో కూడా మజ్లిస్ తన ఉనికిని చాటుకుంది. అమరావతిలో 6, థానేలో 5, నాగపూర్‌లో 4 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, చంద్రపూర్‌లోనూ ఒక సీటును ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితాలు ఎంఐఎం గ్రాఫ్ నిలకడగా పెరుగుతోందని సూచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ బలోపేతం కావడం, స్థానిక సమస్యలపై పోరాడటం ఆ పార్టీకి కలిసివచ్చింది.

కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్

ఎంఐఎం సాధించిన ఈ 95 సీట్లు కేవలం మున్సిపల్ స్థానాలు మాత్రమే కావు. ఇవి మహారాష్ట్రలో మారబోతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతాలు. సంప్రదాయబద్ధంగా కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) వైపు మొగ్గు చూపే ముస్లిం ఓటు బ్యాంకు ఇప్పుడు ఎంఐఎం వైపు మళ్లుతోందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది లౌకిక పార్టీలకు ఆందోళన కలిగించే అంశం కాగా, ముక్కోణపు పోటీల్లో ఓట్ల చీలిక వల్ల కొన్ని చోట్ల బీజేపీ నేతృత్వంలోని కూటమికి పరోక్షంగా లాభం చేకూరే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్ పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో సమీకరణాలు మారినట్లే !

మహారాష్ట్ర మున్సిపల్ ఫలితాలు ఎంఐఎంను ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టాయి. ఇతర పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొడుతూనే, ముస్లిం మైనారిటీల గళంగా మారడంలో ఆ పార్టీ విజయం సాధించింది. పాతబస్తీలో ఆ పార్టీ పాతుకుపోయి వేరే పార్టీలకు అవకాశం లేకుండా చేసింది. మహారాష్ట్రలో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లోనూ అలాగే పాతుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.