Mahaa Daily Exclusive

  కట్టు కథలకు భయపడను..నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భట్టి

Share

  • కట్టు కథలకు భయపడను
  • సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు
  • నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భట్టి
  • కొత్తగా టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశం

హైదరాబాద్, మహా : ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ విషయంలో తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కొన్ని మీడియా సంస్థలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నేను ఏది పడితే అది మాట్లాడలేను, రాయలేను. నాకు బాధ్యత, విధానం ఉన్నాయని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు సంపాదించుకోవడానికో లేదా వ్యాపారాలు విస్తరించుకోవడానికో కాదని, కేవలం ప్రజా సేవ కోసమేనని తేల్చి చెప్పారు. ప్రజాభవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ. సంస్థనే దానికి కండీషన్ పెడుతుంది. సంబంధిత శాఖ మంత్రికి ఆ వ్యవహారంతో సంబంధం ఉంటుంది. సైట్ విజిట్ పెట్టి తమకు కావాల్సిన వారికి టెండర్ ఇచ్చుకున్నారని కట్టు కథలు రాశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థ నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లను కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే పిలిచిందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో మంత్రి ప్రమేయం ఉండదని, సంస్థే నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

గనులు క్లిష్ట ప్రాంతాల్లో ఉన్నందున ఫీల్డ్ విజిట్ నిబంధన విధించారని, ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో కూడా అమల్లో ఉన్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి తాను సన్నిహితుడిని కావడం వల్లనే, కొందరు ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తూ పత్రికల్లో తప్పుడు రాతలు రాస్తున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననం చేసేలా, నాయకుల మధ్య విభేదాలు సృష్టించేలా కథనాలు రాయడం తగదని భట్టి హెచ్చరించారు. దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ వనరులను కాపాడి, వాటిని పేదలకు సమానంగా పంచడమే తన ధ్యేయమన్నారు. మీడియా సంస్థల మధ్య ఉండే అంతర్గత విభేదాల్లోకి ప్రజాప్రతినిధులను లాగవద్దని, ఇలాంటి అసత్య ప్రచారాలకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు.

బొగ్గు గని టెండర్ రద్దు చేయాలని ఆదేశం

తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విక్రమార్క కీలక నిర్ణయం తీసుకున్నారు. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్‌ను రద్దు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి కట్టుకథలు ప్రచురించారని ఆరోపించారు. ఇంకా ఎవరూ పాల్గొనని టెండర్ విషయంలో తమను ఎలా నిందిస్తారని కంపెనీ యాజమాన్యం తన దృష్టికి తెచ్చిందని వివరించారు. టెండర్ నిబంధనలను రూపొందించేది సింగరేణి యాజమాన్యమే తప్ప మంత్రి కాదన్న కనీస అవగాహన కూడా లేకుండా కథనాలు రాశారని విమర్శించారు.

కాగా, ఒడిశాలోని నైనీ బొగ్గు గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ దాదాపు దశాబ్దం క్రితం సింగరేణికి కేటాయించింది. గతేడాది ఏప్రిల్‌లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తిని భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి చరిత్రలో తెలంగాణ వెలుపల ఉత్పత్తి ప్రారంభించిన తొలి గని ఇదే కావడం గమనార్హం.

Latest