హైదరాబాద్, మహా : సంక్రాంతి పండుగ సీజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్ టీసీ)కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది డబుల్ వీకెండ్ రావడంతో నగరాన్ని వదిలేసిన ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో పండుగ సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లోనే టికెట్ చార్జీల ద్వారా సంస్థకు ఏకంగా రూ. 67.40 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు అధికారులు వెల్లడించారు. అంటే సగటున రోజుకు రూ. 13.48 కోట్ల మేర ఆదాయం రావడం విశేషం.
సాధారణ రోజులతో పోలిస్తే ఈ స్థాయిలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ఆర్టీసీ నడిపిన ప్రత్యేక సర్వీసులు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంస్థ మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పెషల్ బస్సుల ద్వారానే రోజుకు అదనంగా రూ. 2.70 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. పెరిగిన టికెట్ ధరలతో పాటు, ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు మొగ్గు చూపడం సంస్థకు కలిసొచ్చింది.
పండుగ ముగిసి తిరిగి పట్నం బాట పడుతున్న ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇవాళ, రేపు కూడా భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చే వారి కోసం ప్రధాన బస్టాండ్లు, జంక్షన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి రద్దీ వల్ల కలిగిన ఈ భారీ ఆదాయం, ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థకు కొంత ఊరటనిస్తుందని రవాణా శాఖ వర్గాలు భావిస్తున్నాయి








