Mahaa Daily Exclusive

  మద్యం నియంత్రణపై తగ్గేదే లే: వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్!

Share

  • మద్యం షాపు ల సమయపాలనలో తగ్గేదేలేదు
  • మీ వ్యాపారం కోసం ప్రజల ఆరోగ్యాలు పాడు చేయొద్దు
  • నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెంచుతాం
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

నల్గొండ , మహా : మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజ కవర్గంలో మద్యం దుకాణాల సమయపాలనలో ఎమ్మెల్యే విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా మద్యం షాపుల వేళల్లో తాను విధించిన నిబంధనల విషయంలో తన అభిమతాన్ని పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న మద్యం షాపుల సమయపాలనలో మార్పు ఉండబోదని మరోమారు స్పష్టం చేశారు. ఆదివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలవడానికి వచ్చిన కొంతమంది మద్యం వ్యాపారులతో మద్యం షాపుల సమయపాలనపై, మధ్య నియంత్రణపై వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు.

మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరో గ్యాలు పాడుచేయొద్దని, ఉదయం నుండి మద్యం తాగే విధానానికి స్వస్తి పలికేలా మద్యం వ్యాపారులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో మద్యం షాపుల విషయంలో తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని 6 గంటల తర్వాతే పర్మిట్ రూముల్లో అనుమతి ఉండాలన్నారు. అవసరమైతే నియోజకవర్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఇంకా పెంచుతామని, ఉదయమంతా పని చేసుకొని సాయంత్రం పూట మాత్రమే తాగేలా మార్పు తీసుకొస్తున్నామన్నారు.

మద్యం విషయంలో తాము తీసుకొస్తున్న ఈ మార్పుకు ఇతర నియోజకవర్గాల నుండి మంచి నిర్ణయం అవలంబిస్తున్నారని ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. మద్యం విచ్చ లవిడిగా లభ్యం అవ్వడం వల్ల పనులు మానేసి అదే పనిగా తాగుతూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుందని, యువత మద్యానికి బానిసై పెడదొవ పడుతున్నారని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనలు మద్యం వైపు నుండి తమ వ్యక్తిగత అభివృద్ధి వైపు మళ్లిస్తూ గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణ నెలకొల్పడానికే ఈ ప్రయత్నమన్నారు. ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలనలోనూ మద్యం నియంత్రణ విషయంలోనూ రాజీపడే ప్రసక్తే లేదని మద్యం వ్యాపారులకు తెగేసి చెప్పారు. దీంతో మద్యం వ్యాపారు లు మరోమారు ఖంగుతిన్నారు. చేసేది లేక అక్కడి నుంచి ఉసూరుమంటూ వెనుదిరిగారు.