Mahaa Daily Exclusive

  సైబర్ నేరగాళ్లపై ‘సీ-మిత్ర’ పంజా: 10 రోజుల్లోనే 100 ఎఫ్ఐఆర్‌లు.. బాధితులకు ఇంటి వద్దకే న్యాయం!

Share

  • సత్ఫలితాలిస్తోన్న ‘సీ-మిత్ర’
  • పది రోజుల్లోనే 1000 మంది బాధితులకు ఫోన్ కాల్స్
  • 200 ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసిన వర్చువల్ పోలీసులు
  • ఇప్పటివరకు 100 ఎఫ్ఐఆర్‌ల నమోదు
  • సీ-మిత్ర పనితీరుపై బాధితుల హర్షం

హైదరాబాద్, మహా : సైబర్ నేర బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘సీ-మిత్ర’ సత్పలితాలను ఇస్తోంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఈ విధానం అమల్లోకి వచ్చిన పది రోజుల్లోనే వందల మందికి భరోసానిచ్చింది. ఈ స్వల్ప వ్యవధిలో సీ-మిత్ర బృందం 1000 మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. రోజుకు సగటున 100 ఫోన్ కాల్స్ చేస్తున్నారు. బాధితుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 200 మందికి పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి పంపింది. వారి నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే.. ఎక్కడా జాప్యం లేకుండా 100 కిపైగా ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. గంటల తరబడి స్టేషన్లలో పనిలేకుండా, నిమిషాల్లోనే వర్చువల్ పోలీసులు స్పందిస్తుండటం, ఎఫ్ఐఆర్ కాపీలు నేరుగా మొబైల్‌కే వస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటి నుంచే ఫిర్యాదు.. ఫోన్ కు ఎఫ్ఐఆర్ కాపీ

సైబర్ నేర బాధితులు 1930 నంబరుకు లేదా జాతీయ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే ‘సీ-మిత్ర’ బృందం రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.

సీ-మిత్ర సేవలను వేగంగా బాధితులకు అందించేందుకు 24 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని సైబర్ క్రైం విభాగం ఏర్పాటు చేసింది. రెండు షిప్ట్ ల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ‘వర్చువల్ హెల్ప్‌డెస్క్’ బాధితులకు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ నేర బాధితులకు ఇబ్బందులు కలగకుండా సత్వర న్యాయం అందించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమం సీ-మిత్రను జనవరి 9వ తేదిన నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ ప్రారంభించారు.