Mahaa Daily Exclusive

  “సొమ్ము ప్రజలది.. సోకు రేవంత్‌ది”: సీఎం హార్వర్డ్ కోర్సుపై బీజేపీ ఘాటు విమర్శలు

Share

  • సొమ్ము ప్రజలది…. సోకు రేవంత్ ది
  • బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ వీ సుభాష్

హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “21వ శతాబ్దం నాయకత్వం” కోర్సులో పాల్గొనడానికి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారని వార్తలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత కోరికలు తీర్చుకునేందుకు ప్రజల సొమ్మును వినియోగించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందని రాష్ట్ర ముఖ్య ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ తెలిపారు.

హార్వర్డ్ యూనివర్సిటీ, జాన్ ఎఫ్. కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో “లీడర్ షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఛావూస్, కాన్ ఫ్లిక్ట్ అండ్ కరేజ్” అనే కోర్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కోర్సు జనవరి 25 నుండి 30 వరకు జరుగనుందని సమాచారం. ముఖ్యమంత్రి దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం హాజరైన తర్వాత నేరుగా అమెరికాకు వెళ్తారు. ఈ అంశంపై స్పందించిన సుభాష్ “నాయకత్వం వారం రోజుల కోర్సు లేదా సర్టిఫికెట్‌తో రాదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, సుపరిపాలనతో వ్యవహరించడం, జవాబుదారీతనాన్ని చూపడం.. ఇవే నిజమైన నాయకత్వమని సూచించారు. రేవంత్ రెడ్డి ఇలాంటి చదువులు జీవితంలో ముందే పూర్తిచేయాల్సింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి అసలు క్లాస్‌రూమ్ హార్వర్డ్ కాదు ఆయన పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రమే నిజమైన క్లాస్‌రూమ్ అని ఎన్.వి. సుభాష్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఈ పర్యటన వ్యక్తిగత ఆశల కోసం మాత్రమే నడుస్తున్నట్టుగా ప్రజల మధ్య సందేహం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ప్రజల పన్ను డబ్బుతో వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడం తగదని హితవు పలికారు.

ఇటీవల ప్రజల డబ్బుతో నిర్వహించిన ఫుట్‌బాల్ ఈవెంట్ ను గుర్తు చేస్తూ.. “ఫుట్‌బాల్ ఆడాలన్న వ్యక్తిగత కోరికను ప్రభుత్వ కార్యక్రమంగా చూపించడం, ఇప్పుడు చదువు పేరుతో విదేశీ పర్యటనలు చేయడం ఇవన్నీ పాలనపై కాకుండా ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారంపైనే ధ్యాస పెట్టినట్లు స్పష్టమవుతోందని ఎన్.వి.సుభాష్ విమర్శించారు. ఒకవైపు ముఖ్యమంత్రి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి నిధులు లేవని చెబుతున్నారంటూ మరోవైపు, అదే ప్రభుత్వాధినేత విదేశీ కోర్సుల కోసం ప్రజల డబ్బును ఖర్చు చేయడం ఏ నైతికత..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఖర్చు చేసే డబ్బు, సమయం రైతుల సమస్యలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఉపయోగిస్తే తెలంగాణ ప్రజలకు నిజమైన మేలు జరిగేదని తెలిపారు. ఈ కోర్సు నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పాలనలో గంభీరత, బాధ్యత కనిపించాలి. ప్రతీకాత్మక కార్యక్రమాలు కాదు… ప్రజలకు స్పష్టంగా కనిపించే ఫలితాలే అవసరమని ఆయన సూచించారు. మొత్తంగా తెలంగాణ ప్రజలు విదేశీ సర్టిఫికెట్ల కోసం ఓటు వేయలేదు. పారదర్శకంగా, సమర్థవంతంగా పాలించే నాయకత్వం కోసం ఓటు వేశారని సుభాష్ స్పష్టం చేశారు.