- హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు
- 9 కి.మీ.ల భారీ హైలెవల్ బ్రిడ్జి
హైదరాబాద్, మహా : హైదరాబాద్ లోని అత్యంత రద్దీ ప్రదేశమైన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ తదితర ప్రాంతాలలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ తిప్పలకు త్వరలో చెక్ పడనుంది. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవైన సరికొత్త హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రేవంత్ సర్కార్ పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన ఆదివారం మేడారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధి,గ్రామీణ మౌలిక సదుపాయాల పటిష్టతపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా నగరంలోని ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు భారీ వ్యూహరచన చేసింది.
ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెం. 12, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతం. ఐటీ కారిడార్‌కు వెళ్లే వాహనదారులకు ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ కొత్త హైలెవల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే నగరం మధ్యలో నుంచి ఐటీ హబ్‌కు ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. ఇది సిగ్నల్ లేని ప్రయాణాన్ని అందించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న రోడ్లపై భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.








