- ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్
- అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య విద్య
- ఉస్మానియాలోనైనా, ఆసిఫాబాద్‌లోనైనా ఒకే స్థాయి విద్య అందాలి
- అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం
హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య బోధనను మెరుగుపరిచే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సంప్రదాయ విద్యా విధానంతో పాటు, అత్యాధునిక సాంకేతికతతో కూడిన డిజిటల్ ఎడ్యుకేషన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వైద్య విద్యలో సాంకేతికతను జోడించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా విద్యార్థులందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4,140 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో కాలేజీల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో విద్యా ప్రమాణాలపై ఎటువంటి రాజీలేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చదివిన వైద్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని, అదే స్థాయి బోధనను కొత్తగా ఏర్పాటైన జిల్లాల కాలేజీల్లోనూ అందించాలన్నారు. ఉస్మానియా విద్యార్థికైనా, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ విద్యార్థికైనా ఒకే రకమైన అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందాలన్నారు. మెడికోలకు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం చేయకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించాలని, ఇందుకోసం ప్రతి మెడికల్ కాలేజీలో ప్రాథమిక స్థాయి నుంచే డిజిటల్ మౌళిక వసతులను కల్పించాలని సూచించారు. తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పరీక్షించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలని సూచించారు.
క్లిష్టమైన అనాటమీ, సర్జికల్ ప్రొసీజర్ల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు వర్చువల్ ల్యాబ్స్, సిమ్యులేషన్ టూల్స్, వర్చువల్ రియాలిటీ వంటి అధునాతన పద్ధతులను వినియోగించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం కళాశాలలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దాలని, ఈ కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి భవిష్యత్ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించి, వీటిని ఇతర కళాశాలలకు మెంటార్/శిక్షణా కేంద్రాలుగా మార్చాలన్నారు.
డిజిటల్ లైబ్రరీలు
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పాఠ్యాంశాలను డిజిటల్ రూపంలోకి మార్చి, నేషనల్ డిజిటల్ లైబ్రరీతో అనుసంధానం చేయాలని, బోధనాసుపత్రుల్లోని రద్దీ దృష్ట్యా, విద్యార్థులకు క్లినికల్ కేస్ స్టడీలను వివరించేందుకు టెలీమెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి కళాశాలలో అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌తో పాటు ఐటీ అడ్మినిస్ట్రేటర్లు, టెక్నీషియన్లను నియమించాలని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు జరగాలన్నారు. విద్యార్థుల హాజరు, పనితీరును ఏఐ టూల్స్ ద్వారా నిరంతరం విశ్లేషించాలని, మన వైద్య విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాణించేలా వారిని తీర్చిదిద్దడమే ఈ డిజిటల్ విధానం ప్రధాన ఉద్దేశమని మంత్రి పునరుద్ఘాటించారు.








