- నైనీ కోల్ బ్లాక్ ఆరోపణలు
- రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే సీబీఐ దర్యాప్తునకు సిద్ధం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- గతంలో బీఆర్ఎస్ చేసిందే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తోంది మండిపాటు
- మంత్రుల మధ్య వాటాల పంచాయతీ
న్యూఢిల్లీ, మహా : సింగరేణిలోని నైనీ కోల్ బ్లాక్ కుంభకోణం అంటూ వస్తున్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల విషయంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏం చేసిందో.. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి సింగరేణి కాలరీస్ ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలు సింగరేణి సంస్థని రాజకీయ ప్రయోగశాలగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం పరిశీలిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. నైనీ బ్లాక్‌తోపాటు పూర్తిగా ప్రక్షాళణ చేస్తామన్నారు. మంత్రుల మధ్య వాటాల విభేదాలతో సింగరేణి అంశం బయటకు వచ్చిందన్నారు. దేశ బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడిన కిషన్ రెడ్డి, కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, దేశ పారిశ్రామిక వృద్ధిలో ఈ సంస్థ భాగస్వామ్యం వెలకట్టలేనిదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కార్మికులు పోషించిన చైతన్యవంతమైన పాత్రను కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఒకప్పుడు భారీ లాభాలతో వెలిగిపోయిన సింగరేణి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా ఇబ్బందుల్లోకి వెళ్ళడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక, నిర్వహణ పరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ జోక్యం పెరగడం వల్ల సంస్థ ఉనికికే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే పరిమితం కాదని, ఇందులో 51 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానిది కాగా, 49 శాతం వాటా కేంద్ర ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. సంస్థ డైరెక్టర్లలో రాష్ట్రానికి చెందిన వారు ఏడుగురు ఉంటే కేంద్రానికి సంబంధించిన వారు ముగ్గురు ఉంటారన్నారు. సంస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ముఖ్యంగా ఒడిశాలోని ‘నైని’ వంటి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపులో కేంద్రం చొరవ తీసుకుంటోందని తెలిపారు.
ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలని కేంద్రం నైనీ కోల్ బ్లాక్-2 ను తెలంగాణకు కేటాయించిందన్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో కేంద్రం సహకారం అందిస్తోందని, ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అక్కడి ప్రభుత్వంతో అనుమతులపై చర్చించానన్నారు. నైనీ బొగ్గు గనులకు చివరి అనుమతులు వచ్చాక టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతోందన్నారు. టెండర్లను రద్దు చేయడం సింగరేణికి ప్రత్యక్షంగా అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. సైట్ విజిట్‌కు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధన పెట్టారని గుర్తుచేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన మాత్రమేనని అన్నారు. కానీ, సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీని అర్థం వారికి నచ్చిన వారికి నైనీ బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారన్నారు.







