Mahaa Daily Exclusive

  సభకు రాని సభ్యులకు జీతాలు కట్ చేయాలి: ‘రైట్ టు రీకాల్’ హక్కుపై స్పీకర్ అయ్యన్న సంచలన ప్రతిపాదన!

Share

  • చట్టసభలకు రాని వారికి జీతాలు ఎందుకు?
  • అవసరమైతే పదవి నుంచి తప్పించాలి
  • ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న సంచలన ప్రతిపాదన
  • మీరట్ స్పీకర్ల సదస్సులో కీలక ప్రసంగం చేసిన అయ్యన్న పాత్రుడు

లక్నో, మహా : చట్టసభలకు హాజరుకాని ప్రజాప్రతినిధులకు “నో వర్క్ – నో పే” నిబంధనను వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఒకవేళ అప్పటికీ తీరు మార్చుకోకపోతే, ప్రజలే వారిని పదవి నుంచి దించేలా “రైట్ టు రీకాల్” హక్కును కల్పించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ​ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న చట్ట సభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభలో పాల్గొన్న ఆయన “ప్రజలపట్ల శాసనవ్యవస్థ జవాబుదారీతనం” అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నెలకొన్న పరిస్థితులను ఉదహరిస్తూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జూన్‌లో ఎన్నికైనప్పటి నుంచి కొంతమంది సభ్యులు ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సభకు హాజరు కాలేదని, కనీసం చర్చల్లో కూడా పాల్గొనలేదని ఆయన తెలిపారు. సభకు రాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు, భత్యాలు మాత్రం తీసుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. ఇలాంటి అనైతిక ప్రవర్తన వల్ల ప్రజల దృష్టిలో చులకన అవుతామని పేర్కొన్నారు.

సభకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం స్పష్టమైన నిబంధనలు లేనందున, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దీనికి మార్గం చూపాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ సందర్భంగా రెండు ప్రధాన సూచనలు చేశారు. ఉద్యోగులు విధులకు రాకపోతే జీతాలు కోత విధించినట్లే, సభకు రాని ప్రజాప్రతినిధులకు కూడా “నో వర్క్ – నో పే” నిబంధన అమలు చేయాలని ప్రతిపాదించారు. ​ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తే, రాజ్యాంగాన్ని లేదా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే “రైట్ టు రీకాల్” హక్కును ఓటర్లకు కల్పించాలి అన్నారు.

దురదృష్టవశాత్తు చట్టసభల పనిదినాలు ఏటా తగ్గిపోతున్నాయని, ఇది వ్యవస్థ అనారోగ్యానికి సూచిక అని స్పీకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో కనీసం 60 రోజులైనా చట్టసభలు పనిచేయాలని, అప్పుడే ప్రశ్నోత్తరాలు, ఇతర చర్చల ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రజలకు జవాబుదారీగా ఉండగలమని ఆయన స్పష్టం చేశారు. ​ప్రజాప్రతినిధుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని, ఆత్మవిమర్శ చేసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సభ్యులకు హితవు పలికారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.