హైదరాబాద్, మహా : ప్రపంచ కార్మిక వర్గ విముక్తి కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడు, మహత్తర విప్లవకారుడు లెనిన్ 102వ వర్ధంతి సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి , సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్ అంజయ్య నాయక్, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి శ్రమజీవుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం లెనిన్ చూపిన మార్గం నేటికీ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు.
క్యాపిటలిజం దోపిడీకి వ్యతిరేకంగా లెనిన్ చేసిన పోరాటం, సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని వారు పేర్కొన్నారు. లెనిన్ సిద్ధాంతాలు నేటి యువత, కార్మికులు, రైతులకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయ శ్రీరాములు, విజయ్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.








