- తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
- నేటి నుంచే ప్రారంభం
- ఆగే స్టేషన్లు ఇవే
హైదరాబాద్, మహా : తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. శుక్రవారం దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు ఈ అమృత భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తుండగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇది రెండోది. ఎక్కువదూరం ప్రయాణించే రైలు రూట్లలో ప్రయాణికులకు మరింత సులభతరమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించే దిశగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఈ రైలు ప్రతి మంగళవారం 17041 నెంబరుతో ఈ నడిచే రైలు ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి 17042 నెంబరుతో గురువారం రాత్రి 11.30కు బయలుదేరి.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.
ఆగే స్టేషన్లు
తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తమిళనాడులోని తిరుత్తణి, కటపాడి,జోలార్ పెట్టయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగన్‌సెర్రీ, తిరువల్ల, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల శివగిరి మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.
ఆధునిక వసతులు
ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక పద్ధతుల్లో, స్వదేశీ సాంకేతికతతో డిజైన్ చేశారు. సరసమైన ధరలకే వివిధ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుదూరమైన రూట్లలో ప్రయాణించే వారికి నాన్-ఏసీ ప్రయాణాన్ని సౌకర్యవంతమైన వసతులను అందించనున్నారు. ఈ రైలులో ప్రయాణికులకోసం ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ మరియు బాటిల్ హోల్డర్స్, రాత్రివేళల్లో బోగీలో దారి సరిగ్గా కనిపించేలా రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, సౌకర్యవంతమైన సీటింగ్/స్లీపింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రో-న్యుమాటిక్ ఫ్లషింగ్ తో కూడిన మాడ్రన్ టాయిలెట్స్, మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే వ్యవస్థ, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, స్పీడ్ చార్జింగ్ పాయింట్స్, పాంట్రీ కార్ వంటి వసతులు ఉండనున్నాయి.
ఈ రైలుతో పాటు మరో మూడు రైళ్లను కూడా శుక్రవారం నాడు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. మొదటిది.. నాగర్‌కోయిల్ నుంచి మంగళూరుకు, రెండోది.. తిరువనంతపురం నుంచి తాంబరం వరకు, మూడోది.. త్రిస్సూర్ నుంచి గురువాయూర్ వరకు నడవనున్నాయి.
ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
తెలంగాణకు మరో అమృత్ భారత్ రైలును కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మశుక్రవారం తిరువనంతపురం నుంచి చర్లపల్లికి వచ్చే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. రేపు 02029 నెంబరుతో నడవనుంది.








