- జాయింట్ సబ్‌రిజిస్ట్రార్‌పై అక్రమ ఆస్తుల కేసు
- రూ.7.83 కోట్లకు మించి ఆస్తులు గుర్తింపు
కుషాయిగూడ, మహా : రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ –1)గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూధన్‌రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదైంది. తనకు తెలిసిన ఆదాయ వనరులకు మించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దివంగత కె. బాల్‌రెడ్డి కుమారుడైన మధుసూధన్‌రెడ్డి (50) అవినీతి నిరోధక చట్టం–1988 (2018 సవరణ)లోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారంఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, సహచరులకు చెందిన మొత్తం ఏడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాల్లో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాప్రా, ఈసీఐఎల్ పరిధిలోని భవానీ నగర్ కాలనీలో 300 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ భవనం, ఇబ్రహీంపట్నం చింతపల్లిగూడ గ్రామంలో ఓపెన్ ప్లాట్, పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, మంగళ్‌పల్లి గ్రామంలో ఒక ఎకరం వాణిజ్య భూమిని గుర్తించారు. అలాగే పరిగి మండలం నస్కల్ గ్రామంలో స్విమ్మింగ్ పూల్ ఉన్న ఫామ్‌హౌస్ (రూ.1.24 కోట్ల విలువ), సుమారు రూ.9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మూడు విలాసవంతమైన కార్లు—ఇన్నోవా ఫార్చ్యూనర్, వోల్వో ఎక్స్ సి 60 బి5, వోక్స్వ్యాగన్ టైగన్ జీటీ ప్లస్—కూడా గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చర ఆస్తుల విలువ సుమారు రూ.7.83 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇంకా ఆర్ఏఆర్కే స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు, భార్య, పిల్లల పేర్లతో రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. అదనపు ఆస్తులపై తనిఖీలు కొనసాగుతుండగా, కేసు దర్యాప్తు దశలో ఉందని అధికారులు తెలిపారు.








