Mahaa Daily Exclusive

  కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండానే లక్ష్యం: బండి సంజయ్ ధీమా

Share

  • తెలంగాణ చూపంతా కరీంనగర్ కార్పొరేషన్ వైపే..
  • మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం
  • గెలిచే చోట పాతవాళ్లకే టిక్కెట్లు ఇస్తాం
  • కలిసికట్టుగా పనిచేద్దాం….కాషాయ జెండా ఎగరేద్దాం
  • పార్టీ నేతల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్
  • కేంద్ర మంత్రి సమక్షంలో 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణరెడ్డి చేరిక
  • 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సహా పలువురు నేతలు బీజేపీలో చేరిక

కరీంనగర్, మహా : కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈసారి బీజేపీకి మంచి వాతావరణం ఉందని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని కైవసం చేసుకోవడమే లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని సాదరంగా ఆహ్వానించడంతోపాటు కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచే అవకాశమున్న చోట పార్టీ కార్యకర్తలకే టిక్కెట్లు ఇస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్స్ లో బీజేపీ నేతల సమావేశం జరిగింది. 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణరెడ్డి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అట్లాగే 56వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి తన అనుచరులతో కలిసి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.

అనంతరం జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లరమేశ్, సీనియర్ నేతలు ఓదేలు, వాసాల రమేశ్, రాజేంద్రప్రసాద్, డాక్టర్ పుల్లెల పవన్, బోయినిపల్లి ప్రవీణ్, గుజ్జ క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన నాయకులను ఉద్దేశించి సంజయ్ మాట్లాడుతూ ‘‘బీజేపీలో పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీ కంటే పెద్దోళ్లు ఎవరూ లేరు. ఎవరున్నా లేకున్నా పార్టీ కొనసాగుతుంది. గతంలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండే. ఇప్పుడు వరుసగా 3 సార్లు అధికారంలో కొనసాగుతోంది.’’అని చెప్పారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ వారసత్వ కుటుంబ రాజకీయాలతో దేశాన్ని కుంటుపడేసిందన్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేయడమే లక్ష్యంగా మోదీ నాయకత్వంలో కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో కసితో పనిచేస్తున్నామని చెప్పారు.

‘‘కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కసితో పనిచేస్తున్న జిల్లాల్లో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ లో కరీంనగర్ జిల్లా కార్యకర్తల భాగస్వామ్యం చాలా ఎక్కువ. కరీంనగర్ కార్యకర్తల సహకారంవల్లే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సక్సెస్ అయిన. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందా? లేదా? అనే దానిపై రాష్ట్రమంతా ఎదురు చూస్తోంది’’అని పేర్కొన్నారు. ‘‘బీజేపీకి అద్బుతమైన మంచి వాతావరణం ఉంది. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు రావడానికి సద్ధంగా ఉన్నారు. వాళ్లను రానీయకుండా కొందరు అడ్డుకోవాలనుకుంటున్నారు. ఇది సరికాదు. కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకోవాలంటే… అందరం కలిసి పనిచేయాలి’’అని కోరారు.

కరీంనగర్ మేయర్ సీటును కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అందుకోసం దేనికైనా తెగించడానికి సిద్దపడదామని చెప్పారు. ఎన్నడూ లేనివిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం తాకిడి ఎక్కువగా ఉందని, ఒక్కో డివిజన్ కు 20 మందికిపైగా టిక్కెట్ ఆశిస్తున్నారని చెప్పారు. గెలిచే అవకాశమున్న చోట పాత కార్యకర్తలకే తప్పనిసరిగా టిక్కెట్లు ఇస్తామని, కష్టపడినా గెలిచే అవకాశం లేనిచోట ప్రత్యామ్నాయం చూస్తామని తెలిపారు. వివిధ సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని, టిక్కెట్లు రానివారిని సముదాయించాల్సిన బాధ్యత జోన్ అధ్యక్షులు, పార్టీ నేతలపైనే ఉందని చెప్పారు. ‘‘వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలోకి వచ్చినా వాళ్లకే టిక్కెట్లు గ్యారంటీగా ఇస్తామనే అవకాశమే లేదు. అంతిమంగా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు కేటాయింపు ఉంటుంది’’అని స్పష్టం చేశారు.