Mahaa Daily Exclusive

  బండి సంజయ్ సంచలనం: “ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు పోలీసులే నాకు చూపారు.. రేవంత్ సర్కార్‌కు దమ్ముందా?

Share

  • ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి ఆధారాలన్నీ ఉన్నాయి
  • విచారణ సందర్భంగా పోలీసులే నాకు ఆధారాలు, సాక్షాలు చూపారు
  • మంది కొంపలు ముంచిన కేటీఆర్ వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా?
  • రేవంత్ రెడ్డికి పౌరుషం లేదు… చేవ చచ్చిపోయింది
  • బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచకాలపై చర్యలు తప్పవు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్, మహా : ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసేందుకు కాంగ్రెస్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. విచారణ పేరుతో హడావుడి చేసినప్పుడల్లా ఫాంహౌజ్ నుండి ఏఐసీసీకి ముడుపులు వెళుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు, సాక్షాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలో ఆ ఆధారాలను, సాక్షాలను సైతం చూపించారని తెలిపారు. జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తేలిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన సంజయ్ ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ టీవీ సీరియల్ ను మించి ఆది అంతం లేకుండా కొనసాగుతూనే ఉందన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని, సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారని, నిజానికి సిట్ అధికారులు సమర్ధులు, నిజాయితీపరులు. కానీ వాళ్లపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందన్నారు. కేటీఆర్ ను ఎందుకు విచారణకు పిలిచారు? ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా? లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని చెప్పడానికి పిలిచారా? అని సంజయ్ అడిగారు.

సిరిసిల్ల కేంద్రంగా వార్ రూంను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలా సార్లు చెప్పానని, యువరాజు కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరిగాయని, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారన్నారు. నా ఫోన్లను, ప్రస్తుత సీఎం, మంత్రుల ఫోన్లతోపాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసిందని, అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడమేంటి? అని అడిగారు. రెండేళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటి? ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్ట్ చేశారా? ఎన్ని ఆస్తులు జప్తు చేశారు? ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?… స్వయంగా కేసీఆర్ కూతురే తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. మాజీమంత్రి హరీష్ రావు ఆ టైంలో ఏడాదిపాటు ఫోన్ కూడా వాడలేదు. ఇన్ని సాక్షాలు, ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? కేసీఆర్ పాలనలో సామాన్యులు మొదలు భిక్షాటన చేసే వ్యక్తులు కూడా ఫోన్ ఉన్నా వాట్సప్ కాల్ లో తప్ప నార్మల్ కాల్ మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారన్నారు. నన్ను సిట్ విచారణకు పిలిచి 6 నెలలైంది. మావోయిస్టు జాబితాలో నా నెంబర్ ఉంచి ఫోన్ ట్యాప్ చేశారని పోలీసులే చెప్పారు. ఆధారాలు కూడా నాకు చూపించారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే అరెస్టుల పర్వం కొనసాగించాలన్నారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు.