హైదరాబాద్, మహా : చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం టిక్కెట్ ధరల పెంపు విషయంలో హైకోర్టులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ 11 జనవరి నుంచి 18 జనవరి వరకు పెంచిన ధరల (సింగిల్ స్క్రీన్లకు రూ. 50/-, మల్టీప్లెక్స్‌లకు రూ. 100/- జీఎస్టీతో కలిపి) ప్రకారం విక్రయించిన టికెట్ల వాస్తవ గణాంకాలను సమర్పించాలని జీఎస్టీ అధికారులను తెలంగాణకోర్టు ఆదేశించింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంపు అక్రమమని అందువల్ల ఈ సినిమా ద్వారా అక్రమంగా సంపాదించిన రూ.45 కోట్లను రికవరీ చేయాలని డాక్టర్ పాదూరి శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. చట్టవిరుద్ధంగా ఈ సినిమా టికెట్ ధరలు పెంచారని అందువల్ల ఈ సినిమా ఆర్జించిన రూ. 42 కోట్లను ప్రతివాదులు సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధి (అక్యుములేటెడ్ ఫండ్) కి లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అలాగే దీనిని గతంలో దాఖలైన పుష్ప-2, గేమ్ ఛేంజర్, అఖండ-2, రాజా సాబ్ వంటి సినిమాల టికెట్ ధరల పిటిషన్లతో కలిపి తదుపరి వాయిదా విచారిస్తామని పేర్కోంది.








