Mahaa Daily Exclusive

  తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు: 36 మందిపై సీబీఐ సిట్ తుది ఛార్జ్‌షీట్!

Share

  • తిరుమల కల్తీ నెయ్యి కేసు
  • 36 మందిపై సీబీఐ సిట్ ఛార్జ్‌షీట్
  • కోర్టులో చార్జీషీట్ తుది దాఖలు

నెల్లూరు, మహా : ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తి అయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాలతో కూడిన తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు విచారణలో శాస్త్రీయంగా నిర్ధారించారు.

36 మంది నిందితులు.. 12 మంది టీటీడీ ఉద్యోగులు

ఈ భారీ స్కామ్‌లో సిట్ మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్న అప్పన్న పేరు ఛార్జ్‌షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై, కిలోకు రూ. 25 చొప్పున కమీషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హవాలా మార్గాల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణలో తేలింది. అప్పన్న ఎవరి కోసం ఇలా చేశాడో సీబీఐ తేల్చాల్సి ఉంది.

బోలేబాబా డెయిరీ మాయాజాలం

ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. అస్సలు పాలు, వెన్న సేకరించని ఈ డెయిరీ.. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనాలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసింది. 2019-24 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని రూ. 250 కోట్ల విలువైనది టీటీడీకి అంటగట్టినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2022లో ఈ డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ, ఇతర బినామీ డెయిరీల పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించడం గమనార్హం.

దెబ్బతిన్న లడ్డూ నాణ్యత – సీబీఐ స్పష్టీకరణ

కమీషన్ల కక్కుర్తి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సీబీఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు, నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా ల్యాబ్ రిపోర్టులను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది.